సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నివాసంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్‌తో చెన్నై పోలీసులు ఒకింత టెన్షన్‌లో పడ్డారు. అయితే చివరికి బయటపడిన నిజం అందరినీ షాక్‌కు గురి చేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో వరస హిట్స్‌తో సూపర్‌స్టార్ స్థాయికి చేరుకున్న త్రిష.. దశాబ్దాలుగా ఫ్యాన్స్ హార్ట్‌లో రాణిస్తోంది. తెరపై అందంగా, ఆఫ్‌స్క్రీన్‌లో సైలెంట్ లైఫ్ గడిపే త్రిష ఇప్పుడు బాంబు బెదిరింపుతో వార్తల్లో నిలిచింది.
చెన్నైలోని ఆళ్వార్‌పేట్‌లో త్రిష నివాసం ఉంది. తాజాగా గుర్తు తెలియని వ్యక్తి తమిళనాడు డీజీపీ కార్యాలయానికి త్రిష ఇంట్లో బాంబు పెట్టామంటూ మెయిల్ పెట్టడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుఠాహుఠిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో త్రిష నివాసానికి చేరుకున్నారు. త్రిష ఇంటి పరిసరాలను పోలీసులు గంటలపాటు చుట్టుముట్టారు. డాగ్ స్క్వాడ్‌తో ఇంచు ఇంచుగా తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో త్రిష ఇంట్లో లేనప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు టెన్షన్‌కు గురయ్యారు.
సుదీర్ఘ సోదాల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఈ బెదిరింపు బూటకమని పోలీసులు స్పష్టం చేశారు. ఇది ఆకతాయిల పనేనని నిర్ధారించారు. అయితే త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ మూడు సార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఇది నాలుగోసారి కావడంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు. తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సీన్‌లోకి దిగింది. ఆ మెయిల్ వెనుక ఉన్న ఐపీ అడ్రస్, సర్వర్ వివరాలు ట్రేస్ చేస్తోంది.