దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ బాంబు భీతికి వణికిపోయింది. సోమవారం ఉదయం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడు నగరాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ పేలుడులో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు తీవ్రతతో కారు ముక్కలైపోయింది. అదృష్టవశాత్తూ ఆ రోజు ఎర్రకోటకు సెలవు ఉండటంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. అయితే ఢిల్లీ బ్లాస్ట్ మిస్టరీగా మారింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, పేలుడు కారు వెనుక భాగంలోనే జరిగిందని తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు తర్వాత రోడ్డుపై గుంతలు పడకపోవడం, మృతులు మరియు గాయపడిన వారి శరీరాలపై పేలుళ్లలో సాధారణంగా కనిపించే పదునైన వస్తువులు లేదా గాట్లు ఏవీ లేకపోవడం అధికారులు ఆశ్చర్యంగా భావిస్తున్నారు. ఇది సాధారణ బాంబు కాదు, కొత్త రకం పేలుడు పదార్థాలతో చేసిన అత్యాధునిక బాంబు అయి ఉండవచ్చని ఫోరెన్సిక్ టీమ్ సూచించింది.
పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం, ఈ బాంబులో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ వంటి మిశ్రమాలను ఉపయోగించినట్టు తేలింది. ఇకపోతే ఈ ఘటన వెనుక ఉగ్రవాద కుట్ర ఉన్నట్లు పోలీసులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పేలుళ్లకు పాల్పడిన అంతర్జాతీయ ముఠాతో సంబంధాలు ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి ఈ దాడి సూత్రధారి అని భావిస్తున్నారు. అతని ఫోటోను ఢిల్లీ పోలీసులు తొలిసారిగా విడుదల చేశారు. అయితే పేలుడులో ఉమర్ మరణించాడా? లేక పరారీలో ఉన్నాడా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా, ఢిల్లీ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి అప్రమత్తం చేసింది. బ్లాస్ట్ అనంతరం ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఎ, ఎన్ఎస్‌జి, ఇంటెలిజెన్స్ బ్యూరోలు కలిసి దర్యాప్తు చేపట్టాయి. నగరంలోని కీలక ప్రదేశాల్లో భద్రతను పెంచారు. మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ మార్కెట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఒక్కొక్క సన్నివేశం కొత్త మలుపులు తిరుగుతోంది.