``తట్టలు మోసిన.. బుట్టలు అల్లిన.. నా తెలంగాణ సమాజం కోసం కలం పట్టిన`` అని.. చాటి చెప్పి.. తెలంగాణ ఉద్యమ గళంగా వినుతికెక్కిన..గేయ రచయిత.. ప్రముఖ గాయకుడు `అందెశ్రీ` ఇక లేరు. సోమవారం ఉదయం ఆయన అస్తమించారు. దీంతో తెలంగాణ ఉద్యమ కారులు, తెలంగాణ సమాజం నివ్వెర పోయింది. అశ్రుధారలతో ఆయనకు నివాళులర్పిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు.. తర్వాత కూడా.. ఆయన గళం తెలంగాణ సమాజం గురించే తపించింది.. పలవరించింది!.
``ఏం సాధించినం.. పదేళ్ల పాలనలో!
ఏం సాధించినం.. ఉద్యోగాలా.. నిధులా.. నీళ్లా?
ఏం సాధించినం.. అన్నదాతల ఆత్మఘోష తప్ప!
ఏం సాధించినం.. బతుకమ్మల బతుకు రోదన తప్ప!!``
- అంటూ.. పదేళ్ల కేసీఆర్ పాలనపై కూడా ఆయన నిర్మొహమాటంగా తన కలాన్ని విదిలించి.. సర్కారును నిలదీశారు. మంచి-చెడుల మిశ్రమంగా సాగిన ఆయన సాహిత్య ప్రయాణంలో అలుపెరుగని సేవ జరిగిం ది.. ``విమర్శనాత్మక సాహిత్యం నా కలం-బలం` అని చెప్పుకొన్న అందెశ్రీ.. మెప్పులకు, మెచ్చుకోళ్లకు ఏ నాడూ తలొగ్గలేదు. ఆయనకు అవార్డులు రాలేదన్న బెంగలేదు. తెలంగాణ సమాజం బాగు పడలేదన్న ఆవేదన తప్ప!.
కాగా.. అందెశ్రీ అసలు పేరు.. అందె యల్లన్న. 66 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించారు. గొర్రెల కాపరుల కుటుంబంలో పుట్టిన ఆయన.. చిన్నప్పటి నుంచే సమాజ సమస్యలపై అవగాహన పెంచుకు న్నారు. ``తట్టలు మోసిన.. బుట్టలు అల్లిన.. నా తెలంగాణ సమాజం కోసం కలం పట్టిన`` అని చెప్పుకొన్న అందెశ్రీ(కలం పేరు) సిద్దిపేట జిల్లాలో జన్మించారు. కాగా.. ఆయన రాసిన గీతాల్లో జయజయహే తెలంగాణ గీతానికి రాష్ట్ర గీతం హోదా దక్కగా.. ``మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు`` గీతానికి ప్రజలు `పట్టాభిషేకం` చేశారు.
కొసమెరుపు ఏంటంటే.. ఆయనను ఎవరైనా ఉద్యమ గళం అంటే.. ఒప్పుకొనే వారు..``నేను సమాజ గళాన్ని. ఉద్యమం కొందరిని మెప్పిస్తుంది.. మరికొందరిని నొప్పిస్తుంది. సమాజ గళం అందరికీ స్ఫూర్తి నిస్తుంది.`` అని చాటుకున్నారు.