ఏపీలో పెట్టుబడుల వరద పారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 70 అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చించారు. వీటిలో పెట్టుబడులు, రెవెన్యూ సహా పలు అంశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు కీలక సూచనలు కూడా చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు హోం శాఖ కూడా సహకరించాలన్నారు.
రాజధాని అమరావతిలో జనవరి నుంచి ప్రారంభం కానున్న క్వాంటం కంప్యూటింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటింగ్ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలురాష్ట్రానికి వస్తున్నాయని సీఎం చంద్ర బాబు వివరించారు. తద్వారా కంప్యూటర్ రంగ నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు రాష్ట్రం ప్రధాన సెంటర్‌గా మారుతుందన్నారు. ప్రధానంగా బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. దీనికి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.వీటిలో ప్రధానంగా విశాఖ, తిరుపతి, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు ఉండడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్న డ్రోన్ పరిశ్రమకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీనిని 50 ఎకరాల విస్తీర్ణంలో.. ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సిమెంటు తయారీ సంస్థ.. బిర్లా గ్రూపునకు నెల్లూరులో భూమి కేటాయించాలన్న ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా విదేశీ సంస్థ సిగాచీకి ఓర్వకల్లులో 100 ఎకరాలను కేటాయించారు. అనకాపల్లి జిల్లాలో `డోస్కో` ఇండియా లిమిటెడ్‌కు 150 ఎకరాల కేటాయించారు. ప్రధానంగా విశాఖలో ఐటీ, పారిశ్రామిక సంస్థలకు పెద్దపీట వేస్తూ.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది.