చుక్క పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత జగన్‌దే!

admin
Published by Admin — December 06, 2025 in Politics, Andhra
News Image

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. టీటీడీ వ్యవస్థలను మాఫియా రాజ్యంలా నడిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్ర‌స్తావ‌న తెస్తూ “చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది, ఈ ఫార్ములా చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది” అంటూ ఆనం ఘాటుగా సెటైర్స్ పేల్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం గత ఐదేళ్లలో అవకతవకలకు కేంద్రబిందువుగా మారిందని ఆనం స్పష్టం చేశారు. టీటీడీ వంటి పవిత్ర సంస్థలో “పరకామణి హుండీ లెక్కింపుల్లోనూ భారీ దోపిడీ జరిగిందని, గత ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించిందని” ఆయన మండిపడ్డారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన లడ్డూ ప్రసాదం విషయంలో కూడా మోసాలు జరిగాయని ఆయన ఆరోపించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పట్టించుకోలేదని.. భక్తులను మోసం చేసే స్థాయికి వ్యవస్థ దిగజారిందని గ‌త జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఆనం ఫైర్ అయ్యారు.

గత ప్రభుత్వ హయాంలో లోక్ అదాలత్ కేసులను అనవసరంగా రాజీ చేసుకోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని ఆనం ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కొందరి ఆస్తులను దోచుకున్నారని, ప్రభుత్వం వారిని కాపాడడమే కాకుండా ఆస్తులను కొల్లగొట్టిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 9 డాలర్లు దోచుకున్న వ్యక్తికి కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు.

జగన్‌ టీటీడీ చైర్మన్‌గా తన ఆత్మీయులను నియమించడం కూడా అవినీతి నెట్‌వర్క్‌ను బలోపేతం చేసినట్టేనని ఆనం పేర్కొన్నారు. టీటీడీ వ్యవస్థలలో పారదర్శకత తగ్గిందని, కీలక పదవులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం టీటీడీలో జరిగిన అవకతవకలన్నిటినీ వెలుగులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉందని, భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ మొదటి బాధ్యతని ఆనం స్పష్టం చేశారు. 

Tags
Minister Anam Ramanarayana Reddy YS Jagan TDP YSRCP Ap Politics Ap News Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News