ప్రఖ్యాత పర్యాటక రాష్ట్రంగా గుర్తింపు పొందిన.. తీర ప్రాంత రాష్ట్రం గోవాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 25 మందికి పైగా మృతి చెందారు. వీరిలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారు మంటల్లో చిక్కుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని ప్రాంతం పణాజీకి కేవలం 25 కిలో మీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం.
ఏం జరిగింది?
పర్యాటక రాష్ట్రంగా ఉన్న గోవాలో కొన్ని క్లబ్బులు, పబ్బులకు 24 గంటల అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో `బర్చ్ బై రోమియో లేన్` అనే నైట్ క్లబ్బులో అర్ధరాత్రి తర్వాత.. వంటలు చేస్తున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనతో మంటలు విస్తరించాయి. వంట చేస్తున్న ముగ్గురు మహిళ లు సహా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దహనమయ్యా రు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది క్లబ్ సిబ్బందే ఉన్నారని అధికారులు తెలిపారు.
మిగిలిన వారిలో ముగ్గురు పర్యాటకులు కూడా ఉన్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. ఈ ఘటనతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. నైట్ క్లబ్బులు నిర్వహించే వారి వివరాలను సేకరించింది. అనధికారికంగా క్లబ్బులు నిర్వహించే వారు.. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించేది లేదని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుందని సీఎం చెప్పారు.
కేంద్రం హెచ్చరించిన నెలలోనే
కాగా.. గోవాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పర్యాటకం పేరుతో నైట్ క్లబ్బులకు విచ్చల విడిగా ద్వారాలు తెరిచారు. ఈ వ్యవహారంపై కొన్ని నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నైట్ క్లబ్బులకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వమే అయినప్పటికీ.. కేంద్ర పాలిత ప్రాంతం కూడా అయిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. ఈ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ పరిణామాల క్రమంలోనే పుట్టగొడుగుల్లా నైట్ క్లబ్బులు పెరిగిపోయాయి.