షాకింగ్ కథనాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన వైనం సంచలనంగా మారింది. మద్యం సేవించి వాహనాల్ని నడిపే వారిపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా.. రోడ్డు ప్రమాదాల్ని కనిష్ఠ స్థాయికి తీసుకొచ్చేందుకు వీలుగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వీకెండ్ల అత్యధికంగా నిర్వహిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పట్టపగలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక వీఐపీ జోన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులపై సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.
డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో దొరికిన వారిని కొందరు ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్న వైనం కళ్లకు కట్టినట్లుగా సదరు మీడియా రిపోర్టులో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై హైదరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ వేటు వేస్తున్నా.. మరోవైపు కొందరు పోలీసు అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా కొందరు ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న గలీజు తీరు హాట్ టాపిక్ గా మారింది.
వెస్ట్ జోన్ పరిధిలోని వీఐపీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడే వారు.. కేసు చిక్కుల్లో నుంచి తప్పించుకోవటానికి సరికొత్త పద్దతికి తెర తీసినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో పట్టుబడిన వారికి నోటీసులు ఇచ్చేస్తారు. కానీ.. కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులు కేసులు నమోదు చేయకుండా పంపించేస్తారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాహనాన్ని స్వాధీనం చేసుకునే కానిస్టేబుల్ తన ఫోన్ నెంబరు ఇచ్చి సంప్రదించాలని చెబుతాడు. ఆ తర్వాత వాహనం గురించి స్టేషన్ కు వచ్చే సందర్భంలో అసలు కథకు తెర తీస్తారని చెబుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో దొరికిన వాహనదారుల్లో కొందరి నుంచి రూ.10వేలు ప్లస్ నాలుగు బిర్యానీలు ఇస్తే కేసు లేకుండా తప్పించేస్తున్న వైనాలకు సంబంధించిన రెండు ఉదంతాల్ని ప్రస్తావిస్తూ పేర్కొన్న ఈకథనం పోలీసు వర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. అంతేకాదు.. ఖరీదైన వాహనాలకు వీల్ లాక్ వేయటం ద్వారా కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్న వైనం తెర మీదకు వచ్చింది. అందరూ కాకున్నా కొందరు పోలీసు అధికారులు చేస్తున్న గలీజు చేష్టలు పోలీసు శాఖకు చెడ్డపేరు తీసుకొస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ తీరుపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.