సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా అజేయంగా కనిపించిన పార్టీ ఇప్పుడు రోజుకో కీలక నేతను కోల్పోతూ బలహీనపడుతోంది. తాజాగా ఈ వలసల బెడద జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వరకూ చేరడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలవరం మొదలైంది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ కంచుకోటగా పేరొందిన పులివెందుల నియోజకవర్గంలోనే కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి (దిల్ మాంగే) తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం పొలిటికల్‌గా ఫ్యాన్ పార్టీకి షాక్ తగిలినట్లైంది.
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో జరిగిన చేరికల కార్యక్రమంలో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ సందర్భంగా వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా, స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొని పార్టీ బలోపేతంపై ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు జరుగుతున్నప్పటికీ, జగన్ అడ్డాగా భావించే పులివెందులలోనే నేతలు పార్టీ వీడటంతో జగన్ కంచుకోట కూలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామం స్థానికంగా వైసీపీ శ్రేణుల్లో ఆందోళనను, అయోమయాన్ని పెంచుతోంది.