ఏపీ సీఎం చంద్రబాబులో బలమైన మార్పు కనిపిస్తోందా? ప్రజలకు చేరువయ్యేందుకు ఉన్న కీలక మార్గా లను ఆయన అన్వేషిస్తున్నారా? అంటే..ఔననే అంటున్నారు నాయకులు. ఒకప్పుడు ఉచితాలకు వ్యతిరేకం అయిన.. చంద్రబాబు పెట్టుబడులు.. మెజారిటీ వర్గాలను ఆహ్వానించడం ద్వారా ప్రతి ఒక్కరూ సొంతంగా సంపాయించుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. రాను రాను రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. దీంతో ఇప్పుడు సంక్షేమానికి పదును మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఉచితాలను విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు `సూపర్ సిక్స్`ను ప్రకటించారు. వాటిని అమలు చేస్తున్నారు. అంతేకాదు.. చంద్ర బాబు మనసు పెట్టి అమలు చేస్తున్నారన్నది తెలిసిందే. ఇప్పుడు వాటితోపాటు.. మరో రేంజ్‌లో చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిచోటా ఉచితాలకు అవకాశం కల్పిస్తున్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు, టిడ్కో ఇళ్లలో గ్రౌండ్‌ఫ్లోర్ రిజర్వ్ చేయడం, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్, ఆర్థికంగా రాయి తీలు వంటి ఏడు ప్రకటించారు.
అదేవిధంగా ఇటీవల కళాకారుల కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా అలానే ఉచితాలు ప్రకటించారు. ఇది బాబులో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తోంది. ఊహించని విధంగా వచ్చిన మార్పు పార్టీ గ్రాఫ్‌ను పెంచుతుందన్న వాదనా వినిపిస్తోంది. వీటికి మరింత పదును పెట్టే దిశగా తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాకు 200 మంది చొప్పున కొత్త పింఛన్లను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం కూడా లేదన్నారు.
అంతేకాదు.. పింఛన్లను 4000లకు పెంచడం, ఉచిత ఆర్టీసీ బస్సు సహా.. సోలార్ రూఫ్ టాప్‌లు ఇలా.. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిజానికి ఇప్పటికి అయింది రెండేళ్లు మాత్రమే. కానీ, ఇంతగా అనేక కార్యక్రమాలు ప్రకటించిన చంద్రబాబు భవిష్యత్తులో మరిన్నికార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా.. వచ్చే ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు .. ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్షేమానికి మరింత పదును పెట్టనున్నారు.