రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చి.. యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్న తమపై వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ``మీరు తీసుకురారు.. తెచ్చేవాటిని, వచ్చే వారిని కూడా అడ్డుకుంటున్నారు`` అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 22 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తున్నాయని.. ఒప్పందాలు కూడా చేసుకున్నామని చెప్పారు. విశాఖ, అమరావతి సహా ఇతర ప్రాంతాల్లోనూ పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు.
అయితే.. ఐటీ పెట్టుబడులు సహా అన్నింటినీ అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిలో భాగంగా.. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా వంటి సంస్థలకు భూములు కేటాయించామని తెలిపారు. ఈ భూముల కేటాయింపును తప్పుబడుతూ.. హైకోర్టులో వైసీపీ నేతలు.. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసి.. కుట్రలకు తెరదీశారని ఆరోపించారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేంటని ప్రశ్నించారు. జగన్‌కు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదని.. దుయ్యబట్టారు.
తాజాగా మరోసారి `రహేజా ఐటీ పార్కు`కు కేటాయించిన భూములపైనా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ‘‘ఈ ప్రాజెక్టులతో ఏపీ యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు అం దించే అవకాశముంది. యువత భవిష్యత్తుపై జగన్‌కు ఇంత ద్వేషమెందుకు? రాష్ట్రానికి వచ్చే పెట్టుబడు లు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన సబబా?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. అంతేకాదు.. మీ హయాంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే.. చూడలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.
వైసీపీ ఏమందంటే..
నారా లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో తమకు సంబంధం లేద ని తెలిపింది. న్యాయ స్థానాల ద్వారా అభివృద్ధిని అడ్డుకునేది టీడీపీ నేనని.. ప్రస్తుతం ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసిన వారు వైసీపీ నాయకులు కాదని విమర్శించింది. నిజాలు తెలుసుకోకుండా.. వ్యాఖ్యలు చేయడం సరికాదని.. పార్టీ ప్రకటించింది.