టీడీపీ పై పవన్ కామెంట్లు..వైరల్

News Image

పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కని సంగతి తెలిసిందే. సహజంగానే కాస్త అసంతృప్తికి లోనైన వర్మను టీడీపీ అధిష్టానం బుజ్జగించడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే, జనసేన వల్లే వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదని గట్టిగా టాక్ వచ్చింది. దీంతో, తమకు సంబంధం లేదని, అది టీడీపీ అంతర్గత వ్యవహారమని జనసేన నేతలు చెప్పారు. ఆ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పిఠాపురంలో పవన్ అఖండ విజయానికి పవన్ కల్యాణ్ ఒక ఫ్యాక్టర్ అని, పిఠాపురం జనసైనికులు, పౌరులు, ఓటర్లు రెండో ఫ్యాక్టర్ అని నాగబాబు అన్నారు. అంతేకాదు, తమలో ఎవరైనా..వేరెవరైనా సరే పవన్ గెలుపునకు తానే దోహదపడ్డానని అనుకుంటే అది వారి….ఖర్మ అంటూ నాగబాబు నొక్కి చెప్పిన వైనం దుమారం రేపుతోంది. ఆ రెండు ఫ్యాక్టర్స్ లేకుంటే ఎవరు ఏం చేసినా ఉపయోగం లేదని అన్నారు. ఇక, తాము పిఠాపురం వచ్చేనాటికే పవన్ గెలుపు ఖాయమైందని, తాము ఏమీ చేయలేదని చెప్పారు. దాంతోపాటు, పవన్ లేకుంటే కూటమి లేదని, చంద్రబాబు సీఎం అయ్యే వారు కాదని, టీడీపీ గెలుపు సాధ్యం కాదని మంత్రి నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఇక, మనం నిలబడడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం అని జనసేన అధినేత పవన్ కూడా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే పవన్, నాగబాబుల కామెంట్లపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు పవన్, నాగబాబు మాట్లాడుతున్నారని ఏకిపారేస్తున్నారు. నా గెలుపు మీ చేతిలో పెట్టాను అంటూ వర్మతో పవన్ అన్న వ్యాఖ్యల వీడియోను చూపించి నాగబాబు, పవన్ లకు కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీకి పవన్ తోడుగా ఉన్న మాట వాస్తవమేనని, కానీ, టీడీపీని నిలబెట్టాం అంటూ పవన్ అనడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Related News