గంజాయి సాగుకు ప్రభుత్వం ఓకే!

admin
Published by Admin — December 28, 2025 in National
News Image

గంజాయి.. డ్ర‌గ్స్‌.. దేశాన్ని కుదిపేస్తున్న కీల‌క మ‌త్తు ప‌దార్థాలు. వీటి బారిన ప‌డి యువ‌త బానిస‌లుగా మారి..కుటుంబాల‌కు దూర‌మ‌వుతున్నారు. అదేస‌మ‌యంలో తీవ్ర అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. క‌ర్ణా ట‌క, త‌మిళ‌నాడు స‌హా అనేక రాష్ట్రాల్లో గంజాయి వినియోగం, సాగు, ర‌వాణాల‌పై నిషేధం ఉంది. అంతేకాదు.. దేశ‌వ్యాప్తంగా కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు అన్ని రాష్ట్రాలు `ఈగ‌ల్‌` అనే ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. మ‌త్తుకు యువ‌త చిత్తు కాకుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మొత్తంగా గంజాయిని నిషేధించే క్ర‌తువులో ముందుకు సాగుతున్నారు.

కానీ.. చిత్రంగా ఓ రాష్ట్రం మాత్రం గంజాయి సాగుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తోంది. గంజాయిని సాగు చేస్తామ‌ని ముందుకు వ‌చ్చే వారికి సైలెన్సులు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. అదే.. హిమాల‌య రాష్ట్రం.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యాపిల్ స‌హా దానిమ్మ పంట‌లు పండిస్తారు. మ‌న‌కు కూడా `హిమాచ‌ల్ యాపిల్‌` సుప‌రిచిత‌మే. ఇక్క‌డే కాదు.. విదేశాల‌కు ఎగుమ‌తి అయ్యే యాపిల్‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పంట‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. అయితే..ఇక్క‌డి రైతులు కొన్నాళ్లుగా న‌ష్టాలు చ‌వి చూస్తు న్నారు. ముఖ్యంగా వాతావ‌ర‌ణ అన‌నుకూల‌త‌లు, పంట‌ల దిగుబ‌డి త‌గ్గ‌డంతోపాటు.. కోతుల స‌మ‌స్య‌ల‌తో సాగుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి.

ఈనేప‌థ్యంలో గుట్టు చ‌ప్పుడు కాకుండా.. గంజాయిని సాగు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా ఫ‌లితం రావ‌డం లేదు. దీనిని గ‌మ‌నించిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం.. తాజాగా గంజాయిసాగుకు రైతుల‌కు లైసెన్సులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీనిని చ‌ట్ట‌బ‌ద్ధం చేయాల‌ని కూడా నిర్ణ‌యించ‌డం విశేషం. గంజాయి సాగు నియంత్రిత విధానంలో చ‌ట్ట బ‌ద్ధం చేస్తూ.. కొత్త విధానానికి శ‌నివారం శ్రీకారం చుట్టారు. ఈ మేర‌కు సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ స‌ఖు `గ్రీన్ టు గోల్డ్‌` అనే విధానాన్ని కొత్త‌గా ప్ర‌తిపాదించారు. ఈ గంజాయి సాగుతో అటు రైతుల‌కు, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా ఆదాయం వ‌స్తుంద‌ని చెప్పారు.

కొన్ని నిబంధ‌న‌లు..

గంజాయి సాగుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. ఇదేస‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు కూడా విధించింది. రైతులు ఖ‌చ్చితంగా లైసెన్సులు తీసుకోవాలి. అదేవిధంగాపెద్ద‌గా మత్తు కలిగించని.. 0.3 శాతం కంటే తక్కువ టెట్రాహైడ్రో కెనబినాల్ ఉన్న గంజాయి మొక్కలనే సాగు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే.. త‌మ పంట‌ల‌ను పారిశ్రామిక అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగించేలా విక్ర‌యించాల‌ని కూడా ప్ర‌భుత్వం తేల్చి చెప్పిండి. దీనిని `పారిశ్రామిక సంపద`గా సీఎం అభివ‌ర్ణించారు. దీని వ‌ల్ల రాష్ట్రానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ నుంచి 2 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అంతేకాదు.. రైతుల‌కు ఇది ప్ర‌త్యామ్నాయ ఆర్థిక ప్రోత్సాహ‌మ‌ని స‌మ‌ర్థించుకున్నారు. 

Tags
Himachal Pradesh government green signal weed farming
Recent Comments
Leave a Comment

Related News