సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వివరాలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి. ఇందుకు హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక సమావేశం వేదికైంది. ప్రతి ఏడాది చివర్లో (క్యాలెండర్) హైదరాబాద్ మహానగర పరిధిలోని హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలకు సంబంధించిన వివరాల్ని మీడియాతో షేర్ చేసుకోవటం తెలిసిందే. ఇప్పటికే రాచకొండ.. సైబరాబాద్ కమిషనరేట్ లకు సంబంధించిన వార్షిక నివేదికను విడుదల చేసిన పోలీసులు.. శనివారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రిపోర్టును విడుదల చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట కేసు వివరాలు వెల్లడయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారని.. సినీ నటుడు అల్లు అర్జున్ ఈ కేసులో ఏ11గా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి డిసెంబరు 24న 112 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- ఈ కేసులో మొత్తం 52 మందిని విచారించి వాంగ్మూలాల్ని తీసుకొని కేసు నమోదు చేశారు.
- మొత్తం 23 మంది నిందితులుగా తేల్చారు. వీరిలో అల్లు అర్జున్ తో సహా పద్నాలుగు మందిని అరెస్టు చేశారు.
- మిగిలిన తొమ్మిది మంది కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
- 2024 డిసెంబరు 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప2 సీనిమా ప్రీమియర్ షో వేవారు.
- ఈ షోకు అల్లు అర్జున్ ను రావొద్దని.. శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా థియేటర్ యాజమాన్యం.. నిర్వాహకులు.. అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
- ఏ1గా సంధ్య థియేటర్ యజమాని అగమాటి పెద రామ్ రెడ్డి.. ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు.
- అనుమతి లేకున్నా అల్లు అర్జున్ రోడ్డు షో నిర్వహిస్తూ థియేటర్ కు వచ్చారు.
- భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నా.. థియేటర్ యాజమాన్యం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించలేదు.
- రద్దీని నియంత్రించటంలో ఫెయిల్ అయ్యారు
- థియేటర్ యాజమాన్యం.. ఈవెంట్ నిర్వాహకులు.. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మధ్య కోఆర్డినేషన్ లేదు.
- థియేటర్ లోపల.. బయటా సామర్థ్యానికి మించి ప్రేక్షకులు.. అభిమానులు రావటం.. వారిని నియంత్రించేందుకు సరైన ఏర్పాట్లు లేవు
- థియేటర్ ఎంట్రీ.. ఎగ్జిట్ లో అస్తవ్యస్త పరిస్థితులు తొక్కిసలాటకు కారణమయ్యాయి.
- నిందితులపై ఐపీసీ సెక్షన్ 304 పార్టు 2 (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసీ సంబంధిత చర్యకు పాల్పడటం)
- ఈ నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది