తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లో.. కీలక నిర్ణయాలు తీసుకుంటా రు. ఫ్యూచర్ సిటీకి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్‌ను డివిజన్లుగా విభజించిన నేపథ్యంలో ఆ మేరకు చట్టంలో మార్పులు చేసేలా సవరణ బిల్లును తీసుకురానున్నారు. ఇక, రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఉన్న వివాదా లు ఈ సమావేశాల్లో కీలకంగా మారనున్నాయి. ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు.. తాము బీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నామని స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురిలో ముగ్గురు మాత్రం.. తాము కాంగ్రెస్‌లో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మరింత దూకుడుగా ఉన్న ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. తాజాగా తాను ఉప ఎన్నిక వచ్చినా గెలుస్తానని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటే చేసి..మరోసారి పోటీ చేస్తానని చెప్పారు. అదేవిధంగా బీఆర్ ఎస్ మరో ఎమ్మెల్యే సంజయ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఇక, సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా దాదాపు ఇదే బాటను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చర్చ నడుస్తోంది.. శనివారం దానం మాట్లాడుతూ.. తాను ఇప్పటికి ఖైరతాబాద్ నుంచి ఆరు సార్లు విజయం దక్కించుకున్నానని.. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంతోపాటు.. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జోష్ మీదున్న నేపథ్యంలో ఉప పోరు వచ్చినా విజయం దక్కించుకోవడం ఖాయమన్న వాదన కొందరు వినిపించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి హవా కూడా భారీగా పెరుగుతున్నదరమిలా.. ఇదే సరైన సమయమని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే.. కేసీఆర్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయ్యారని.. దీంతో బీఆర్ ఎస్ గ్రాఫ్ కూడా పుంజుకునే అవకాశం ఉంటుందని అన్నారు. మొత్తంగా దానం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
కానీ.. ప్రస్తుత ప్రాధాన్యాల ప్రకారం.. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ దానం, కడియం, సంజయ్‌లు రాజీనామా చేసినా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు. పైగా.. పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారి రాజీనామాల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా.. కనీసంలో కనీసం నాలుగు మాసాల సమయం తీసుకుంటుంది. ఈ క్రమంలో అప్పటికి బీఆర్ ఎస్ పుంజుకుంటే.. పరిస్థితి ఏంటన్నది కూడాఆలోచన చేసే అవకాశం ఉంది. మొత్తంగా జంపింగుల వ్యవహారం అసెంబ్లీఎన్నికల తర్వాతే ఉంటుందన్న చర్చ జరుగుతోంది.