బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. తాజాగా సోమవారం ప్రారంభ మైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. అయితే.. ఆయన ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం ఆసక్తిగా మారింది. సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతంతో ప్రారంభమైన సమావేశాల్లో పలువురు మృతి చెందిన ఎమ్మెల్యేలకు సంతాప సూచకంగా సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలపై సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు.
అయితే.. సభకు వచ్చిన కేసీఆర్ రికార్డుల్లో సంతకం చేసి.. సభలోపలికి కూడా ప్రవేశించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనను పలకరించడం విశేషం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆయన తో కరచాలనం చేశారు. అదేవిధంగా పలువురు మంత్రులు కూడా కేసీఆర్‌ను కలుసుకున్నారు. అనంత రం.. సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే.. ఈ తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత.. తన సీటు నుంచి లేచిన కేసీఆర్ వడివడిగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం సబబు కాదని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ జరిగిన అన్నిరోజులు కూడా కేసీఆర్ రావాలని ఆకాంక్షించారు. కాగా.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పార్టీ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. తొలుత కేసీఆర్‌ను ఆయన కూడా కలుసుకున్నారు. అనంతరం.. సభ ప్రారంభం కాగానే వెళ్లిపోవడంతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం గమనార్హం.