రాష్ట్రంలో మూడు పార్టీల ఎమ్మెల్యేల వ్యవహారం కొంత చేదుగా.. మరికొంత తీపిగా అనిపించిన సంవత్స రం 2025. వాస్తవానికి 2024లో విజయం దక్కించుకున్న వారిలో 80 మంది కొత్తవారు ఉన్నారు. ఇది దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు విజయం సాధించిన ఎమ్మెల్యేలతో పోలిస్తే.. మెజారిటీ సంఖ్య అనే చెప్పాలి. వీరికి పనిచేసేందుకు ప్రజలతో మమేకం అయ్యేందుకు చాలానే స్కోప్ ఉంది. అయితే.. కొందరు బాగానే పనిచేసి మంచి పేరు సంపాయించుకున్నా.. ఎక్కువు మంది వివాదాల చుట్టూ తిరిగారు.
ఇలాంటి వారిలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వివాదాల నుంచి విమర్శల వరకు చాలా మంది నేతలు.. ఈ ఏడాది చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. వీరిలో తొలి వరుస లో నిలిచారు..తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. సొంత పార్టీపైనా.. ప్రభుత్వంపైనా ఆయన చేసిన విమర్శలు కాకరేపాయి. ఒకసారి కాదు..రెండు సార్లు.. పదే పదే ఆయన వివాదాల చుట్టూ తిరిగారు. ఇక, జనసేన పార్టీకి చెందిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తదుపరి వరుసలో ఉన్నారు.
ఈయన కూడా కూటమి నేతలపై విమర్శలు చేయడంతోపాటు.. మహిళా నాయకురాలు.. రోజాపై చేసిన విమర్శలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా టీడీపీ- జనసేన బంధంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో కొన్ని రోజులు మౌనంగా ఉండాలని పార్టీ నుంచి ఆదేశాలు రావడం గమనా ర్హం. ఇక, సీనియర్‌నేత, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్.. ఓ అంగన్‌వాడీ టీచర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కేసు కూడా నమోదు కావడం.. విచారణ వరకు చేరడం తెలిసిందే.
అలానే.. శ్రీకాళహస్తి యువ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సహా.. పలువు రు నేతలు కూడా వివాదాల్లో చిక్కుకున్న సంవత్సరం 2025. అలానే.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు.. పార్టీకి ఇరుకున పడేలా చేశాయి. ఇక, అనంతపురంజిల్లా.. గుంతకల్లు ఎమ్మెల్యే నుంచి తిరుపతి ఎమ్మెల్యే(జనసేన) ఆరణి శ్రీనివాసులు వరకు కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. మొత్తంగా.. వివాదాలు.. విమర్శలు మూటకట్టుకున్న ఎమ్మెల్యేలు.. వచ్చే ఏడాది మారుతారా? లేదా? అనేది చూడాలి.