వైసిపి నాయకులకు, కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు తెలుస్తున్నాయా లేదా అనేది పెద్ద సందేహంగా మారింది. నిజానికి ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టిడిపి, వైసిపి లకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2014లో టిడిపి విజయం దక్కించుకుంటే 2019లో వైసిపి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు కూడా బలమైన కేడర్ ఉంది. బలమైన నాయకులు కూడా ఉన్నారు. అయితే నాయకులు ఎంతమంది ఉన్నారు.. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు అనే సంఖ్యాబలాన్ని పక్కన పెడితే అసలు సిద్ధాంతం ఏమిటి.. పార్టీలు ఏ విధంగా ముందుకు సాగాలనేది కేలకం.
ఈ విషయంలో టిడిపి పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ వైసీపీ విషయానికి వస్తే మాత్రం `అరాచక పార్టీ`గా ముద్ర పడుతున్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు రెచ్చిపోవడం నాయకులు దూషణలు, బూతులతో విరుచుకు పడిన నేపథ్యంలో సహజంగానే ప్రజల్లో విముఖత ఏర్పడింది. అరాచక పార్టీగా అదేవిధంగా రౌడీలు, గుండాలుగా కూడా కొంతమంది వైసీపీ నాయకులుగా ముద్ర వేసుకునే పరిస్థితి ఆనాడు తలెత్తింది. దీంతో గత ఎన్నికల సమయంలో ప్రజలు చాలామంది నాయకులను ఓడించారు.
మెజారిటీ మాట పక్కన పెడితే గెలుస్తారు అనుకున్న నాయకులు కూడా పరాభవం పాలయ్యారు. బలమైన నియోజకవర్గాల్లో వరుస విజయాలు అందుకున్న వారు కూడా ఓటమి చవిచూశారు. దీనికి ప్రధాన కారణం అరాచక పార్టీ అనే ముద్ర పడడమేనని పరిశీలకులు చెబుతారు. అయితే పార్టీ ఓడిపోయి 11 స్థానాలకు పరిమితమైన తరువాత కూడా పరిస్థితి మారిందా.. నాయకులు మారుతున్నారా.. కార్యకర్తల్లో ఏదైనా మార్పు జరుగుతోందా.. అంటే పైనుంచి అధిష్టానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో తెలియడం లేదు దీంతో క్షేత్రస్థాయిలో ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలు గత వాసనలను వదులుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని చెప్పాలి.
ఇటీవల జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని కేకులు కట్ చేసి రక్తదానం చేసి ఉంటే వైసిపి పరిస్థితి వేరేగా ఉండేది. కానీ దీనికి భిన్నంగా అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వైసిపి కార్యకర్తలు రెచ్చి పోయారు నడిరోడ్లపై జంతువుల తలలు నరికి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీ లకు రక్తాభిషేకం చేయడం నిజానికి ఎవరు సహించే విషయం కాదు. వైసీపీలోనే సీనియర్ నాయకులు దీనిని తీవ్రంగా ఖండించారు. కూడా కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నిజానికి ఇలాంటి పరిణామాలు ఊహించకపోవచ్చు. అధిష్టానం దృష్టిలోకి ఇవి రాకపోవచ్చు.
కానీ, ఘటనలు జరిగిన తర్వాత అయినా సదరు కార్యకర్తలపై చర్యలు తీసుకొని ఆయా ఘటనలను ఖండిస్తున్నామని ప్రకటన చేసే బాధ్యత వైసిపి పై ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లో సానుభూతి పొందాలి అంటే ఇటువంటి ఘటన విషయంలో పార్టీ నిర్దిష్టమైన వైఖరిని తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఇది ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. పోలీసులు చర్యలు తీసుకునేలాగా ప్రేరేపించింది. తద్వారా కార్యకర్తలను రోడ్లపై నడిపించుకుంటూ పోలీసులు తీసుకువెళ్తున్న ఘటనలు వైసిపికి ఒక రకంగా ఇబ్బందికర పరిణామమేనని చెప్పాలి.
ఏది ఏమైనా పార్టీ అధిష్టానం ఇట్లాంటి విషయాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కార్యకర్తలపై కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇలా చేస్తారా లేకపోతే చూస్తూ ఊరుకుంటారా దీనిని సమర్థిస్తారా అనేది చూడాలి.