2025 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించిన అంశాల్లో మూడు ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి. 1) పెట్టుబడులు. 2) అభివృద్ధి. 3) సంక్షేమం. ఈ మూడు అంశాలను ప్రభుత్వం బలంగా తీసుకువెళ్లడంలో ఈ ఏడాది సక్సెస్ అయింది. పదేపదే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వెనుకంజ వేయకుండా నిధుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసింది.
ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి మేజర్ సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికలకు ముందు హామీ ఇవ్వనటువంటి ఆటో కార్మికులకు పదివేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ఈ సంవత్సరం అమలు చేశారు. తద్వారా చెప్పిన వాటితో పాటు చెప్పని పథకాలను కూడా అమలు చేసి సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం ముందంజ వేసింది అనే చెప్పాలి. ఇక, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి రాష్ట్రాన్ని మొత్తం మూడు జోన్లుగా విభజిస్తున్నారు.
మరీ ముఖ్యంగా విశాఖలో ఐటీ కేంద్రం తో పాటు ఇటు కర్నూల్లో జ్యూడిషరీగా డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రాంతీయ భేదాలు రాకుండా జాగ్రత్త పడడంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని చెప్పాలి. ఇక, పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం.. గతానికి భిన్నంగా అడుగులు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లు విదేశాల్లో పర్యటించి పెట్టుబడులు తీసుకొచ్చారు.
ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక రంగంలో సరికొత్త విధానాల ను తీసుకురావడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపేట వేశారు. తద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో ముందు ఉంచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఒకరకంగా రాష్ట్ర భవితవ్యాన్ని సమూలంగా మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా 2025లో రాష్ట్రంలో మూడు కీలక అంశాలు ప్రజలకు చేరువ అయ్యాయని చెప్పాలి.