ప్రతిపక్షం వైసిపికి ఈ సంవత్సరం బలమైన ఎదురుగాలి వీచింది అని చెప్పాల్సి వస్తే అది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపంలోనే అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. సాధారణంగా టిడిపి, వైసిపిల మధ్య ప్రధాన రాజకీయ పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లోను అంతకుముందు ఎన్నికల్లోను కూడా టిడిపి వైసిపిల మధ్య పోటీ నెలకొంది. కానీ ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన పరిణామాలు గమనిస్తే వైసిపి ఓటు బ్యాంకు మీద వైసిపి రాజకీయాల మీద బలమైన ఎదురు దాడి చేస్తున్న పార్టీగా జనసేన నిలిచింది.
అది కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన హెచ్చరికలు వైసిపి పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయనే చెప్పాలి. ఒకాయనొక దశలో అంతర్గత సమావేశాల్లో సైతం పవన్ కళ్యాణ్ ను నిలువరించే విషయంపై చర్చ నడిచింది అన్నది వైసిపి నాయకులు చెప్పిన మాట. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సనాతన ధర్మ దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యిని వినియోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా హిందువులు స్పందించాలని ఇచ్చిన పిలుపు వైసిపిలో ప్రకంపనలు సృష్టించింది.
దీంతో ఉన్న పళాన వైసిపి సుప్రీంకోర్టును ఆశ్రయించి తద్వారా కొంత వేడి తగ్గేలా ప్రయత్నాలు చేసింది. ఇక అనంతర కాలంలో అసెంబ్లీ కి వైసీపీ డుమ్మా కొట్టడంపై కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదిక గానే స్పందించారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా వైసిపి ఇబ్బంది పెట్టింది అప్పులు చేసిందనే విషయాన్ని కూడా ఆయన ఒకటి రెండు సందర్భాల్లో ప్రస్తావించడం ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చర్చ జరిగేలా చేయగలిగారు.
అలాగే కాకినాడ పోర్ట్ లో బియ్యం ఎగుమతులు, అలాగే వైసిపి కనుసన్నల్లో సాగిన రైస్ మిల్లర్ల వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తద్వారా వైసిపి నేతలకు ఆయన బలమైన సంకేతాన్ని ఇవ్వగలిగారు. ఇక, ఎప్పటికప్పుడు వైసిపి నేతలు చేస్తున్న ప్రకటనలు, అదేవిధంగా హెచ్చరికలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం ఈ ఏడాది స్పష్టంగా కనిపించింది.
ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారులు అదేవిధంగా కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన పెల్లుబికేలా చేసింది. ఈ వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఈ ఏడాది వైసీపీకి బలమైన మెరుపు గర్జన లాగా పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించిందనేది పరిశీలకులు చెబుతున్న మాట.