ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, లోకేష్ యువనాయకత్వం కలిపి ప్రపంచ పటంపై ఏపీకి ప్రత్యేక స్థానం తెచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఆర్థిక వార్తా సంస్థ మనీ కంట్రోల్ విడుదల చేసిన 2025 టెక్ అండ్ స్టార్టర్ గైడ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఏ అంటే ఆంధ్ర అని మనీ కంట్రోల్ పేర్కొన్న విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.
2025లో టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో కీలక పరిణామాలపై మనీ కంట్రోల్ సంస్థ ఒక ప్రత్యేకమైన నివేదిక రూపొందించింది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారం ట్రెండ్ లను పోల్చింది. అందులో ఏ ఫర్ ఆంధ్ర అని ఆ సంస్థ నామకరణం చేయడంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భారత దేశపు నూతన టెక్ డార్లింగ్ గా ఆంధ్రా అవతరించిందని మనీ కంట్రోల్ వెల్లడించడం సంతోషాన్నిచ్చిందన్నారు. భవిష్యత్తును నడిపించే శక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందని అన్నారు.
దేశ టెక్నాలజీ రంగంలో ఏపీ కీలక శక్తిగా మారుతోందని, పెట్టుబడులకు ఆవిష్కరణలకు ఏపీ కేంద్ర బిందువుగా నిలుస్తుందని మనీ కంట్రోల్ కథనంలో పేర్కొన్న విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు.