ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసి 24 గంటలు కూడా గడవకుండానే.. ఆయా జిల్లాల్లో పాలన శర వేగంగా ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను, జాయింట్ కలెక్టర్‌లను కూడా వెనువెంటనే నియమించారు. నూతన మార్కాపురం జిల్లా మొదటి కలెక్టర్ గా పి. రాజాబాబు బాధ్యతలను స్వీకరించారు. పండుగ వాతావరణంలో మేళతాళాలతో మార్కాపురం జిల్లా ఆవిర్భావం అంగరంగ వైభవంగా జరిగింది.
మార్కాపురం నగరంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో కొత్త కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కూటమి నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా ఇన్చార్జి కలెక్టర్ కు బాణసంచా, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అదేవిధంగా పోలవరం జిల్లాకు కూడా అధికారులను కేటాయించారు. వారు ఈ రోజు సాయంత్రం బాధ్యత లు చేపట్టనున్నారు. కాగా.. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం తో.. అక్కడ నియమితులైన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు మరింత గా ప్రభుత్వ సేవలు చేరువ చేయాలని.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని పేర్కొన్నారు. అధికారుల కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ప్రతి ఒక్కరూ ప్రజలకు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు