ఏపీలోని కూటమి ప్రభుత్వం.. ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో పలు పథకాలను చేరువ చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. వాటిని అమలు చేస్తోంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను కూడా.. ప్రభుత్వం ప్రజలకు చేరువచేస్తోంది. ఆటో డ్రైవర్లకు రూ.15000 చొప్పున ఇచ్చే పథకంతోపాటు.. బీసీ సామాజిక వర్గాలకు కూడా కొన్ని పథకాలను అమలు చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా `గరుడ స్కీమ్`పై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధి కోసం.. 2014-19 మధ్య అప్పటి సీఎంగా చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తొలిసారి ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పిల్లల చదువులు, వివాహాలు, విదేశీ విద్య సహా.. అనేక రూపాల్లో ఆదుకున్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సామాజికవ ర్గం లోని వితంతువులకు ఈ కార్పొరేషన్ ద్వారా పింఛ న్లు మంజూరు చేశారు. అదేవిధంగా సొంతగా పనులు చేసుకునేవారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించా రు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కార్పొరేషన్ ను కొనసాగించినా.. ఇతర ఆర్థిక సాయాలను మాత్రం నిలిపివేశారు. ఇలా.. బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుకు మాత్రమే అన్నట్టుగా పరిమితం అయింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ఈ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన బ్రాహ్మణ యువతకు.. రుణాలు ఇచ్చారు. వితంతువులు, ఒంటరి మహిళలకు.. పింఛన్లను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే `గరుడ` పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఏంటీ పథకం..
పేద బ్రాహ్మణులు అనారోగ్యంతో అయినా.. సహజంగా అయినా మరణిస్తే.. వారి అంత్యక్రియలకు ప్రభుత్వం `గరుడ` పేరుతో ఆర్థిక సాయం అందిస్తుంది. దీనినే గరుడ స్కీమ్‌గా పేర్కొంటున్నారు. ఒక వ్యక్తికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. దీనిలో బీపీఎల్ కింద ఉన్న బ్రాహ్మణ కుటుంబలను పరిగణనలోకి తీసుకుంటారు. వారి కుటుంబంలో ఎవరు మృతి చెందినా.. గరుడ స్కీమ్ కింద రూ.10 వేలను ఆర్థిక సాయంగా అందించి.. చివరి సంస్కారాన్ని నిర్వహించే ఏర్పాట్లు చేస్తారు.