ఏపీ ప్రభుత్వానికి 2025 సంవత్సరం ఓవరాల్‌గా అన్ని విధాల కలిసివచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటు ప్రజలకు సంక్షేమం ఇవ్వడంతోపాటు.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టామన్నారు. 2025లో భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు సాధించామని చెప్పారు. తాజాగా సోమవారం సచివాలయంలో గత ఏడాది చేపట్టిన కార్యక్రమాలు... జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు.. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు వంటి కీలక విషయాలపై సీఎంచంద్రబాబు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీకి 2025లో భారీ మేలు జరిగిందన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ పుంజుకుందని.. వచ్చే మూడేళ్లలో ఒక రూపం సంతరించుకుంటుందని తెలిపారు. గత వైసీపీ విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టామని చంద్రబాబు చెప్పారు. ఆర్థికంగా.. ప్రాజెక్టుల పరంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా కాపాడామన్నారు. లేకపోతే.. దివాలా తీసిఉండేదని.. వ్యాఖ్యానించా రు. అదేసమయంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే ముందుందన్నారు. దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మేరకు ఏపీకి వచ్చాయని.. ఇది గతంలో ఎన్నడూ జరగని విషయమని చెప్పారు.
ఇక, 2025లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుంచి సాయం అందించామని చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామన్నారు. జిల్లాల విభజన, ప్రాంతాల పేర్లు మా ర్పు వంటివి ప్రజల ఇష్టానికి, వారి అభిరుచులకు అద్దంపట్టే నిర్ణయాలుగా చంద్రబాబు పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. రీసర్వే చేపట్టి గ్రామాల్లో రైతుల భూములకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2025లో అందరికీ ఓవరాల్‌గా మేలు జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
అదే స్ఫూర్తి..
అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రజలకు పనిచేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మరింత ఎక్కువగా ప్రజలకు చేరువ కావాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలనిసూచించారు. అదేసమయంలో ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య కేవలం జల వివాదాలు మాత్రమే ఉన్నాయని.. వీటిని వివాదాలు గా కాకుండా.. సానుకూలంగా చూస్తే.. పరిష్కరించుకునేందుకు అవకాశంఉంటుందని తెలిపారు.