రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి 19 నెలలు పూర్తయ్యాయి. 2024, జూన్ 11న ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పాలనలో సీఎం చంద్రబాబు.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలకపాత్ర పోషించారు. అదేసమయంలో మంత్రి నారాలోకేష్ పాత్రను కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. అయితే.. కూటమికిరెండు చక్రాలు మాదిరిగా ఉన్న సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ గ్రాఫ్ ఎలా ఉంది? అనేది కీలకం.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు.. ప్రధానంగా మూడు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 1) అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి: ఈ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నారు. 2) పెట్టుబడుల కల్పన: రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. దానిని నెరవేర్చేందుకు అహరహం శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగానే.. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తున్నారు. 3) సంక్షేమం.. దీనికి కూడా పెద్ద పీటవేశారు. సూపర్ సిక్స్‌ను అమలు చేశారు.
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కీలకమైన రెండు విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 1) గ్రామీణ ప్రాంతాల అభివృద్ది: బాపూజీ చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి గ్రామాలే పట్టుకొమ్మలని భావిస్తున్న పవన్ కల్యాణ్.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలకు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. 2) రాష్ట్రంలో హిందూత్వను కాపాడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు.
సో.. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ గ్రాఫ్‌లు.. పైపైకి పెరుగుతున్నాయని అంటు న్నారు పరిశీలకులు. గత వైసీపీ తప్పులను సరిచేస్తుండడంతోపాటు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిలో పెట్టేందుకు ఇరువురు నేతలు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మరీముఖ్యంగా కూట మిలో పట్టు సడలకుండా.. ఇరువురునేతలు చక్కగా పనిచేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పడం ద్వారా ప్రజల మైండ్ సెట్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.