రాష్ట్రంలో ప్రజలు.. కేవలం ప్రభుత్వం నుంచి పాలననే కాదు.. ఒకింత జోష్‌ను కూడా కోరుకుంటారు. వారాంతాలు.. పర్వదినాల సమయంలో ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాల కోసం ప్రజలు వేచి చూస్తారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడాఉవ్విళ్లూరుతారు. గతంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం వారాంతాల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, విజయనగరం ఇలా.. ప్రధాన నగరాల్లో వ్యాయామాలు.. ఎమ్యూజ్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించేది.
ఇక, పర్వదినాలకు ముందు నాలుగు రోజుల పాటు.. ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రత్యేకంగా చాటేలా అధికారికంగా కార్యక్రమాలు చేపట్టేది. దీంతో ఒకవైపు పాలనతో పాటు.. మరోవైపు ప్రజలకు వారాంతాలు.. పర్వదినాల సమయంలో ఒక విధమైన ఆహ్లాదభరిత వాతావరణం చేరువ అయింది. ఇక, యోగా కార్యక్రమాలు ఏటా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆనాడు.. యువత, మహిళలు పెద్ద ఎత్తున ఆయా కార్యక్రమాల్లో పాల్గొని తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు.
అయితే. వైసీపీ హయాంలో వారాంతాలు.. ప్రత్యేక కార్యక్రమాలు అనే మాటే లేకుండా పోయింది. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి మాత్రమే నాటి ప్రభుత్వం పరిమితం అయిందన్న వాదన విమర్శ కూడా వినిపించింది. దీంతో ప్రజలకు ఆహ్లాలదం, ఆనందం.. ఒకింత దూరమయ్యాయి. ఇక, సినిమా టికెట్ల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం చేసిన రచ్చతో ఆ చిన్నపాటి ఆనందం కూడా ప్రజలకు దూరమైందనే వాదన వినిపించింది.
దీనికి భిన్నంగా ఇప్పుడు మరోసారి కూటమి సర్కారు.. ప్రజలకు పాలనతోపాటు.. సంక్షేమాన్ని.. ఆహ్లాదా న్ని కూడా పంచేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖ సహా.. అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ.. ముందస్తు సంక్రాంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. దీనిలో ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. మొత్తంగా.. గత వైభవాన్ని తిరిగి తీసుకువస్తూ.. ప్రజల్లో సంతోషం నింపడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.