మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ జగన్ హయాంలో నత్తనడకన సాగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2019-24 మధ్యకాలంలో జగన్ సీఎంగా ఉన్పప్పుడు ఆ కేసు విచారణను ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలోనే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వివేకా హత్య జరగగా...2024 ఎన్నికలు ముగిస ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు.
అయినా సరే వివేకా కుమార్తె సునీత మాత్రం న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో సునీత తాజాగా అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సునీత సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వివేకా కేసులో సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.
3 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం చెప్పింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని ఆదేశించింది. అయితే, తమకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి సునీత తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే ఈ కేసులో తాజాగా సునీత దాఖలు చేసిన అప్లికేషన్ తో పాటు పెండింగ్లో ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.