వైసీపీ హయాంలో అధికారుల పనితీరు అందరికీ తెలిసిందే. నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా.. చాలా మంది అధికా రులు కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పటికీ కొందరు అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ హయాం లో పనిచేసిన అధికారులపై అనేక విమర్శలు వచ్చాయి. వాస్తవానికి గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొందరు అధికారులు ఇలానే కేసుల్లో చిక్కుకున్నారు. శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్ అధికారులు జైలు కూడా వెళ్లారు. ఇంకా ఆ కేసులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.
ఇలానే వైసీపీ హయాంలోనూ చాలా మంది అధికారులు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అధి కారుల పనితీరు ఎలా ఉంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది. గతంలో మాదిరిగా అయితే.. ఇప్పుడు అధికారులు సొంత నిర్ణయాలు తీసుకునేందుకు.. ఒక వ్యక్తికి, లేదా ఒక వ్యవహారానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. అన్ని విషయాలను పారదర్శకంగా ఉంచుతున్నారు. అదేసమయంలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్ల పనితీరును స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. జిల్లాల అధికారులకు సంబంధించిన విషయాల పైనా దృష్టి పెడుతున్నారు. దీంతో ఆయాజిల్లాల్లో అధికారులు వ్యవహరిస్తున్నతీరు.. ముఖ్యంగా నాయకులతో వ్యవహరిస్తున్న విధానాలను కూడా సీఎం చంద్రబాబు ఓ కంట కనిపెడుతున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిస్తే.. వెంటనే వాటిని రద్దు చేస్తున్నారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తన శాఖపై పట్టుబిగించారు. ఉన్నతాధికారులకు స్వేచ్ఛ ఇస్తూనే.. మరోవైపు.. అన్ని విషయాలను స్వయంగా పరిశీలిస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో అధికారుల తీరు అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ ఒకటికి రెండు సార్లు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన విషయాలు, అదేసమయంలో ఆర్థికంగా కలిసి వచ్చే గనుల కేటా యింపు.. రహదారుల కాంట్రాక్టులు ఇచ్చే విషయంలోనూ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, వైసీపీ హయాంలో తీవ్ర వివాదంగా మారిన మద్యం వ్యవహారాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేశారు. అంతేకాదు.. ప్రతి విషయాన్నీ ఆడిట్ చేస్తున్నారు. సో.. మొత్తంగా చెప్పాలంటే.. గతానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎక్కడా చిన్నలోపం రాకుండా.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా.. వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.