సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్ల తర్వాత ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని 2000 సంవత్సరంలోనే అంచనా వేసిన దార్శనీకుడు చంద్రబాబు. ఈ నేపథ్యం లోనే తాజాగా తన విజన్ ను మరోసారి చంద్రబాబు ప్రూవ్ చేసుకున్నారు. భవిష్యత్తులో యువతకు ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించేందుకు ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఏపీ ఫస్ట్) పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు.
యువత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా, వారికి అన్ని విధాలా సహకారం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధం కావాలని సూచించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో కీలకం కాబోయే రంగాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలు రూపొందిస్తుందని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ రంగానికి ఏపీ పెద్దపీట వేస్తోందని, ఆ క్రమంలోనే కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, దేశంలో ఇదే తొలి ప్రాజెక్టు అని వివరించారు. తిరుపతిలో ఐఐటి, ఐఎస్ ఈఆర్ వంటి రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతుందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ఫస్ట్ ను సమర్థవంతంగా నిర్వహించాలని, అందుకు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు తీసుకోవాలని, కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు.