ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలతో వారిద్దరూ బిజీబిజీగా గడిపి రాష్ట్రానికి పలు కంపెనీలను తీసుకువచ్చారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో భారీ భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో మల్టీ నేషనల్ కంపెనీ ముందుకు వచ్చిందని మంత్రి లోకేష్ ప్రకటించారు.
కాకినాడలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఏఎం గ్రీన్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. జర్మనీ, సింగపూర్, జపాన్ కు గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు.
ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల 8000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భారతదేశం నుంచి తొలిసారిగా గ్రీన్ అమ్మోనియా ఎగుమతి ఆంధ్ర ప్రదేశ్ నుంచే జరగబోతుందని, అందుకు గర్వపడుతున్నామని చెప్పారు. 2030 నాటికి ఏఎం గ్రీన్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించబోతుందని అన్నారు.