తెలంగాణలో త్వరలోనే జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం రిజ ర్వేషన్‌లను ఖరారు చేసింది. దీని ప్రకారమే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయం స్పష్టమ వుతుంది. అనంతరం.. పార్టీలు ఆయా వర్గాలకు టికెట్లు ఇస్తాయి. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి.. అంతా ప్రత్యక్ష పోరే సాగనుంది. అంటే.. జెండాలు, అజెండాలపైనే జరగనుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా సర్కారు రిజర్వేషన్‌లు ఖరారు చేసింది. మొత్తం రిజర్వేషన్‌లలో పెద్దగా మార్పు ఏమీ చేయలేదు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌నే అమలు చేశారు. వాస్తవానికి మునిసిపల్ ఎన్నికల్లో కనీసంలో కనీసం.. 40 శాతం రిజర్వేషన్ అమలు ఉంటుందని అనుకున్నా.. గతంలో చేసిన బిల్లులు ఇప్పటికీ అనుమతి పొందలేదు. దీంతో 33 శాతానికే ప్రభుత్వం పరిమితం అయింది. ఇక, ఎస్సీ, ఎస్టీలకు.. రాజ్యాంగం ప్రకారం దక్కే రిజర్వేషన్‌నే ఖరారు చేసింది.
మొత్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మేయర్లు, మునిసిపల్ చైర్మన్లకు సంబంధించి ఖరారు చేసిన రిజర్వేషన్ ప్రకారం.. బీసీలకు 33 శాతం, ఎస్టీలకు 4 శాతం కేటాయించారు. ఇక, మహిళలకు 50 శాతం సీట్లు ఇచ్చారు. దీంతో కార్పొరేషన్లు.. మునిసిపాలిటీల్లో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక, మొత్తం 121 మునిసిపాటిల్లో 60 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు అయింది. బీసీలకు 38 , ఎస్టీలకు 5, ఎస్సీలకు 17 సీట్లు కేటాయించారు. దీంతో 40 శాతం మాత్రమే జనలర్‌కు దక్కనుంది.
కీలకమైన ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లను మహిళలకు కేటాయించినా.. వాటిని జనరల్‌కు ఇచ్చారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంది. ఏదేమైనా కీలక ఘట్టం ముగిసిన నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.