నిన్న మొన్నటి వరకు బెట్టింగ్ యాప్‌లు సాధారణ ప్రజలను ఆర్థికంగా కడగండ్ల పాల్జేశాయి. ముఖ్యంగా యువతను చిత్తు చేశాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు కట్టడి చేశారు. ఇదేసమయంలో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చారు. ఇంకొందరిని విచారిం చారు. ముఖ్యంగా సినీరంగానికి చెందిన వారిని కూడా వదిలి పెట్టకుండా.. వారిని కూడా పిలిచి.. హెచ్చరించారు. మొత్తంగా బెట్టింగ్ యాప్‌ల రగడ కొంత వరకు తగ్గుముఖం పట్టింది.
అయితే. ఇప్పుడు వాటిస్థానంలో `లక్కీ డ్రా`లు తెరమీదికి వచ్చాయి. లక్కీడ్రా పేరుతో నిర్వహిస్తున్న ప్రచారాలు జోరందుకున్నా యి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసేందు కు కొందరు బయలు దేరారని.. వీటిపై నిషేధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. అదేసమయంలో బెట్టింగ్ యాప్‌లను గతంలో ప్రోత్సహించిన వారు..ఇప్పుడు లక్కీ డ్రాలను కూడా ప్రోత్సహించేందుకు చూస్తున్నారని.. ఇలాంటి వారు వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
``లక్కీ డ్రాల పేరుతో అమయాక ప్రజలను మోసం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం`` అని సీపీ హెచ్చరించారు. ఇదేస మయంలో ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా సీపీ వార్నింగ్ ఇచ్చారు. లక్కీ డ్రాలను ప్రమోట్ చేయొద్దని.. ఇవి ప్రజల జీవితాలపై ఆర్థిక అంశాలపై తీవ్ర ప్రభావంచూపిస్తాయని తెలిపారు. ఇప్పటికే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు.. లక్కీ డ్రా పేరుతో ప్రమోషన్లు చేస్తున్నారని వెల్లడించారు. లక్కీ డ్రాలో కార్లు, బైకులు, డీజేలు ఇస్తామంటూప్రకటిస్తున్నారని.. కానీ, ఇది మోసపూరిత చర్య అని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలన్నారు. లేకపోతే చట్ట ప్రకారం.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాపులారిటీని మంచికి వినియోగించుకోవాలని ఆయన సెలబ్రిటీలకు సూచించారు.