ఏపీలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వేటలో కీలక ఘట్టానికి తెరదీసింది. గత ఏడాది పలు దేశాలకు వెళ్లిన సీఎం చంద్రబా బు, మంత్రి నారా లోకేష్.. ఈ ఏడాది తొలి పర్యటనగా దావోస్‌కు వెళ్లారు. హైదరాబాద్ నుంచి తొలుత ఢిల్లీకి వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా దావోస్ చేరుకునే విమానంలో ఆదివారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మరో మంత్రి టీజీ భరత్ సహా పలువురు అధికారులు ఫ్లైట్ ఎక్కారు. షెడ్యూల్ ప్రకారం.. 18 గంటల ప్రయాణం అనంతరం.. సోమవారం(జనవరి 19) సాయంత్రానికి వారు దావోస్ చేరుకుంటారు. ఈ ఏడాది చేపట్టిన తొలి పర్యటనలో ఇది కీలకంకానుంది.
ఏం చేస్తారు?
ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటన సాగనుంది. కాగా.. దావోస్‌లో పర్యటించడం.. చంద్రబాబు కు కొత్తకాదు. గతంలోనూ 2014-19 మధ్య పలు మార్లు ఆయన దావోస్‌లో పర్యటించారు. తాజాగా మరోసారి ఆయన వెళ్తున్నా రు. ఈ దఫా ప్రపంచ ఆర్థిక వేదిక-2026 వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. అదేసమయంలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. కొందరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హరిత ఇంధనం, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగం, ఫార్మా తదితర రంగాల్లో పెట్టుబడులు.. రాష్ట్రం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించనున్నారు.
ముఖ్యంగా ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్‌మం డ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార ప్రముఖులతో సీఎం చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. 'ఏపీ లాంజ్' పేరుతో ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు.
పూర్తి షెడ్యూల్ ఇదీ..
+ మొత్తం పర్యటన 19 నుంచి 22 వరకు(నాలుగు రోజులు)
+ 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంటుంది.
+ 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహిస్తారు.
+ 9 రౌండ్‌టేబుల్ సమావేశాలలో పాల్గొంటారు.
+ 3 యూరోపియన్ దేశాల ప్రతినిధులతో భేటీలు.