వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. చాలా రోజుల తర్వాత ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. త్వరలోనే ఆయన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారు ల ముందుకు రావాల్సిన నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించిన తీరు.. చేసిన కామెంట్లు కూడా రాజకీయంగా చర్చకు దారితీ శాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. పలు సందర్భాల్లో ఆ పార్టీపై సాయిరెడ్డి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
కోటరీ కారణంగానే తాను బయటకు రావలసి వచ్చిందని కూడా సాయిరెడ్డి చెప్పారు. ఇప్పుడు కూడా అదే కోటరీని కార్నర్ చేస్తూ.. సాయిరెడ్డి మరింత పదునైన వ్యాఖ్యలు చేశారు. `అమ్ముడు పోయిన కోటరీ` అంటూ.. వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ న ఎవరి పేరును కానీ.. పార్టీని కానీ.. ఉదహరించలేదు. నేరుగా అమ్ముడు పోయిన కోటరీని నమ్ముకోవద్దని పేర్కొన్నారు. ప్రజా నాయకురాలా.. అంటూ సంబోధించిన సాయిరెడ్డి.. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది లేదు. కానీ, సందర్భం మాత్రం వైసీపీని ఉద్దేశించే అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
"అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!``- అంటూ.. సాయిరెడ్డి.. వెనుజువెలాలో ఇటీవల జరిగిన ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. అక్కడి అధ్యక్షుడు, ఆయన సతీమణిని.. ఇటీవల అమెరికా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. భారీ సైన్యం.. అంతకు మించిన భద్రత ఉన్న వెనుజువెలాలోకి అమెరికా సైన్యం ఎలా వెళ్లింది? ఎలా అరెస్టు చేసింది.. అనే విషయాలను పేర్కొంటూ.. అక్కడి ఆయన కోటరీ అమ్ముడు పోయినందుకే ఇలా జరిగిందన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో `అమ్ముడు పోయిన కోటరీ` అంటూ వ్యాఖ్యానించారు. బందీలుగా ఉన్న ప్రజానాయకురలారా అని సంబోధించారు. వీరందరినీ ఆయన అలెర్టు చేశారు. బయటకు రావాలంటూ.. పరోక్షంగా పిలుపునిచ్చారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు.. తర్వాత సాయిరెడ్డిలో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. బయటకు వచ్చాక.. నేరుగా జగన్‌ను ఏమీ అనకపోయినా.. కోటరీ అంటూ.. పదేపదే ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల శ్రీకాకుళంలో మాట్లాడినప్పుడు కూడా.. ఆయన కోటరీ గురించే వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.