ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్.. కీలక నిర్ణయాన్ని వెలువరించారు. హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు తాను పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 19న(రేపు) ఉదయం 9 గంటలకు తన పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. దీనికి `సంకల్ప యాత్ర` అని పేరు పెట్టినట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు.
ఎందుకంటే..
వైసీపీ హయాంలో ఏపీలో అరాచకం రాజ్యలేందని.. బండ్ల గణేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అప్పటి మాజీ సీఎం చంద్రబాబును అన్యాయంగా స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టు చేసి 53 రోజులపాటు జైల్లో ఉంచారని చెప్పారు. అప్పట్లోనే తాను తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్టు తాజాగా ఆదివారం ఆయన వెల్లడించారు. చంద్రబాబుపై వేసిన అభాండాలు.. పెట్టిన కేసులు తొలిగి పోవాలని తాను కోరుకున్నట్టు తెలిపారు.
చంద్రబాబు జైలు నుంచి సురక్షితంగా బయటకు రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు గణేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను పాదయాత్రగా తిరుమలకు వస్తానని మొక్కుకున్నట్టు తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారని.. తెలుగు వారి ఖ్యాతి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చేరుతోందని గణేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఏపీలో ప్రజలకు సుపరిపాలన చేరువ అయిందన్నారు. ఈ నేపత్యంలోనే తాను తన మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు పాదయాత్ర చేయనున్నట్టు వెల్లడించారు.
మనసు శాంతించింది..
ఇటీవల సీఎం చంద్రబాబుపై వైసీపీ హయాంలో నమోదైన కేసులను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన గణేష్.. తన మనసు శాంతించిందన్నారు. దీంతో తాను తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు సోమవారం ఉదయం ఇంటి నుంచి పాదయాత్ర చేయనున్నట్టు వెల్లడించారు. కాగా.. ఇది రాజకీయ యాత్ర కాదని, కేవలం మొక్కు మాత్రమేనని గణేష్ వివరించారు.