జేడీ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశారు?

admin
Published by Admin — February 18, 2026 in Politics
News Image

వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అంటే ఎవరూ గుర్తించకపోవచ్చు. అదే.. జేడీ లక్ష్మీనారాయణ అన్నంతనే తెలుగు ప్రజలందరికి చప్పున గుర్తుకు వస్తారు. అంతటి ఇమేజ్ ఉన్న ఆయన తాజాగా తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ కు తెర తీశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసి.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ఏకంగా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కట్ చేస్తే.. తాజాగా మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ నకు చెందిన ఈటీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఆయన తీరు మొదట్నించి రోటీన్ కు భిన్నంగా సాగింది. సీబీఐలో ఉన్నప్పుడు ఆయన డీల్ చేసిన కేసులన్నీ సంచలనాలే.  ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించినవి కావటం.. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపమన్న ఇమేజ్ ఆయనకు ఉండేది. దీనికి తోడు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు ఉదంతంతో ఆయన ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారారు.

సత్యం కంప్యూటర్స్ స్కామ్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు.. ఇలా హెవీ వెయిట్ కేసులు ఆయన డీల్ చేయటంతో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అనూహ్య రీతిలో సీబీఐకు గుడ్ బై చెప్పటమే కాదు.. ఐపీఎస్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన 2018లో వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. 1990 బ్యాచ్ కు చెందిన లక్ష్మీనారాయణ తొలుత జనసేన పార్టీ అభ్యర్థిగా విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన జనసేనతో తెగ తెంపులు చేసుకొని బయటకు వచ్చేశారు.

ఆ తర్వాత సొంతంగా జైభారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన రాజకీయాల్ని వదిలేసి కార్పొరేట్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ సంస్థ చేస్తున్న ప్రాజెక్టులు.. వ్యాపారాలు వేగంగా విస్తరించుకుంటూ వెళుతున్నారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నారన్న దానికి సంబంధం లేకుండా ప్రాజెక్టులు చేయటం మేఘా ప్రత్యేకతగా చెబుతారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే జేడీ లక్ష్మీనారాయణ తన కెరీర్ ఆరంభంలో అశోక్ లేల్యాండ్  లో ఆర్ అండీలో పని చేసిన అనుభవం ఉంది. మేఘా గ్రూప్ సంస్థల్లో ఈవీ ట్రాన్స్ సంస్థ ఒకటి. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, నిర్వహణను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

జేడీ లక్ష్మీనారాయణకు ఉన్న ఆడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్ మీద అవగాహన తమ సంస్థకు తోడ్పడుతుందని మేఘా ఇంజినీరింగ్ గ్రూపు చెబుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ దేశంలోని అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

మేఘా గ్రూప్ నకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు ఇదో అనుబంధ సంస్థగా చెబుతారు. ఈ సంస్థ అన్ లిస్టెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావటంతో దీని టర్నోవర్ లెక్కలు అధికారికంగా లేవు. కాకుంటే.. వివిధ నగరాల్లో దీని అనుబంధ సంస్థల ఆదాయాన్ని చూస్తే.. మహారాష్ట్ర, ముంబై, తెలంగాణ, బెంగళూరు నగరాల్లో చేసిన వ్యాపారాన్నిచూస్తే దాదాపు రూ.300 కోట్ల మేర ఉన్నట్లుగా తెలుస్తోంది.

2018లో స్థాపించిన ఈ సంస్థ చేసే పనిని సింఫుల్ గా చెప్పాలంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ రాష్ట్ర రవాణా సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సుల్ని సరఫరా చేసి వాటి నిర్వహణ.. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను చూసుకుంటుంది. ప్రస్తుతం 7 రాష్ట్రాల్లోని 15కు పైగా నగరాల్లో సుమారు 3300 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సుల్ని నిర్వహిస్తున్నట్లు చెబుతారు. ఈ సంస్థకు అవసరమైన బస్సుల్ని మేఘా గ్రూప్ నకు చెందిన మరో సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సరఫరా చేయటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

Tags
cbi ex jd lakshmi narayana private forum new job MEGH Group
Recent Comments
Leave a Comment

Related News