అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయన, ఈసారి నేరుగా సాక్షి మీడియా గ్రూపుపై చట్టపరమైన అస్త్రాన్ని ప్రయోగించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ సాక్షి మీడియా యాజమాన్యానికి గట్టి షాక్ ఇచ్చారు.
ఇందిరా టెలివిజన్ (సాక్షి) ఎండీ వైఎస్ భారతితో పాటు బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్‌లకు రఘురామ తన లాయర్ ఉమేష్ చంద్ర ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు కథనాలు అల్లుతున్నారని, వాస్తవాలకు విరుద్ధంగా వార్తలు రాస్తూ తన గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ఈసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు కూడా వెనకాడనని ఆయన స్పష్టం చేశారు.
రూ. కోటి పరువు నష్టం.. అది కూడా అమరావతి రైతులకు!
ఈ నోటీసులో రఘురామ పెట్టిన కండిషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రతిష్టను దెబ్బతీసినందుకు గాను కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఆ మొత్తాన్ని తన కోసం కాకుండా, అమరావతి రైతులకు అందజేయాలని కోరడం విశేషం. గత ఐదేళ్లుగా అమరావతి కోసం పోరాడుతున్న రైతులకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని నోటీసులో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అలాగే తనపై రాసిన తప్పుడు కథనాలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే, సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఈ పరిణామంపై సాక్షి యాజమాన్యం మరియు వైఎస్ భారతి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.