టాలీవుడ్ ప్రేక్షకులకు `సీతారామం`తో సీతగా పరిచయమై, తన నటనతో అందరి మనసు గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. వెండితెరపై ఎంతో హుందాగా కనిపించే ఈ అమ్మడు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంది. తాజాగా మృణాల్ తన పాత ప్రేమాయణం, బ్రేకప్‌కు దారితీసిన పరిస్థితుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి. ముఖ్యంగా ఓ స్టార్ హీరో వల్ల తన రిలేషన్‌లో చిచ్చు రేగిందని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌లో తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సరసన `సూపర్ 30` సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ప్రియుడు తీవ్రమైన అభద్రతా భావానికి లోనయ్యాడట. తన ప్రియురాలు అంత పెద్ద స్టార్ పక్కన నటిస్తుంటే, ఎక్కడ ఆమె తనను వదిలేసి వెళ్ళిపోతుందో అన్న భయం అతనిలో మొదలైందని మృణాల్ చెప్పుకొచ్చింది.
హృతిక్ లాంటి అందగాడితో తన ప్రియురాలు నటిస్తోందని, తను కూడా అంతే స్మార్ట్‌గా కనిపించాలని అతను భావించాడట. ఆ పోటీ తత్వంతో అతి తక్కువ సమయంలోనే 20 కిలోల బరువు తగ్గి, జిమ్‌లో కష్టపడి కండలు పెంచాడట. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్నాళ్లకే మళ్లీ జిమ్ మానేసి బరువు పెరిగిపోవడంతో పాటు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. ఎందుకిలా చేస్తున్నావ్ అని మృణాల్ ప్రశ్నించగా.. ``సినిమా స్టార్లు, గ్లామర్ ప్రపంచంతో నేను పోటీ పడలేను`` అంటూ తన నిస్సహాయతను ఆమె ముందు బయటపెట్టాడట.
కేవలం అభద్రతా భావం మాత్రమే కాదు, మృణాల్ నటిగా కెరీర్ కొనసాగించడం కూడా అతనికి ఏమాత్రం ఇష్టం లేదట. ఒక నటిగా తన వృత్తిని గౌరవించని వ్యక్తితో కలిసి ప్రయాణం చేయడం కష్టమని భావించిన మృణాల్, చివరకు ఆ బంధానికి స్వస్తి పలికింది. ``మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఎదుటి వ్యక్తిలో నమ్మకం లేనప్పుడు ఆ బంధం నిలబడదు`` అంటూ మృణాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా పేర్కొంది.