ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూడడం మీద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కోటి రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ వైసీపీ ఎక్స్ హ్యాండిల్లో పోస్టు పెడితే అది బూమరాంగ్ అయింది. లోకేష్ సొంత ఖర్చులతో ఈ టూర్‌కు వెళ్లినట్లు ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ క్లారిటీ ఇచ్చింది.
లోకేష్ కూడా ‘‘నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లతో చూస్తినా’’ అంటూ పుష్ప స్టయిల్లో జగన్‌కు కౌంటర్ ఇచ్చాడు. అయినా సరే వైసీపీ ఏమీ ఆ పోస్టును డెలీట్ చేయలేదు. ఆ పార్టీ కూడా ఈ వ్యవహారాన్ని పక్కన పెడుతున్నట్లు లేదు. ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ టాపిక్ మీద మాట్లాడారు. తాజా ప్రెస్ మీట్లో జగన్.. లోకేష్ మ్యాచ్ వీక్షణం మీద స్పందించారు.
‘‘నీ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్కదేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్లీ విజయవాడలో ఉంటాడు. మళ్లీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అన్నీ ప్రైవేటు విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లు ఇలా జల్సాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నా. కొలంబోలో మ్యాచ్ ఆడతా ఉంటే ఈయనకేం స్వామీ. టీవీలో చూస్తే కనపడదా మ్యాచ్? నువ్వు క్రికెట్ అభిమానివే అనుకో. టీవీలో చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే మ్యాచ్ చూశా’’ అంటూ ప్రశ్నించారు జగన్.
ఐతే లోకేష్ సొంత ఖర్చుతో సాయంత్రం కొలంబోకు వెళ్లి రాత్రి మ్యాచ్ ముగించుకుని ఉదయానికల్లా వచ్చి విజయవాడలో బిల్ గేట్స్ టూర్లో పాల్గొన్నప్పటికీ.. జగన్ అండ్ కో ఈ విషయం మీద ఇంత రాద్దాంతం చేయడం విడ్డూరం.