హెరిటేజ్ దెబ్బ.. వైసీపీ అబ్బా!

admin
Published by Admin — February 20, 2026 in Politics, Andhra
News Image

టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ.. ఎదురుదాడి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్రలోని ఇండాపూర్ డైరీ వ్యవహారాలను హెరిటేజ్ సంస్థకు ఆపాదిస్తూ కథనాలు ప్ర‌చురించింది. హెరిటేజ్ నెయ్యి నాణ్యత లేనిదని, కల్తీ జరుగుతోందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం కూడా చేశారు. అయితే సాక్షి మీడియా వేదికగా హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వరుస కథనాలు వండి వార్చిన వైసీపీకి, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. అబద్ధపు ప్రచారంతో బురద చల్లాలని చూస్తే.. ఆ బురద కాస్తా తిరిగి సాక్షి మీడియాకే అంటుకుంది. 

తమ 33 ఏళ్ల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, అసత్య వార్తలతో వ్యాపారానికి నష్టం కలిగిస్తున్నారని హెరిటేజ్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చినా సాక్షి మీడియా వినకపోవడంతో, వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 33 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థపై ఆధారాలు లేకుండా కథనాలు ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 24 గంటల లోపు హెరిటేజ్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని వార్తలు, వీడియోలు, విశ్లేషణలను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించాలని ఆదేశించింది. సాక్షి టీవీ, పేపర్ మాత్రమే కాదు.. అటు మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టా), ఇటు ఎక్స్‌ (ట్విట్టర్) సంస్థలకు కూడా కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఈ దెబ్బతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ సైలెంట్ అయిపోయింది. కోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 55 ఫేస్‌బుక్ లింకులు, 52 ఇన్‌స్టాగ్రామ్ లింకులు, 70 యూట్యూబ్ లింకులు, మరియు 85 ఎక్స్ లింకులను తక్షణమే బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఒకేసారి వందలాది లింకులు కనుమరుగు కావడం సాక్షి మీడియా చరిత్రలో ఇదే అతిపెద్ద షాక్. కేవలం దుష్ప్రచారం కోసమే కథనాలు అల్లారని కోర్టు ప్రాథమికంగా భావించడం వైసీపీకి మింగుడు పడటం లేదు.

రూ. 100 కోట్ల గుబులు!
అసత్య కథనాలతో తమ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసినందుకు గాను రూ. 100 కోట్ల పరువు నష్టం చెల్లించాలని హెరిటేజ్ పట్టుబట్టింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని సాక్షి యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. అటు నెయ్యి వివాదంలో రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈ కోర్టు తీర్పు వైసీపీకి గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. మొత్తానికి హెరిటేజ్ దెబ్బకు సాక్షి మీడియా విలవిల్లాడుతోంది.

Tags
Heritage Foods Sakshi Media Delhi High Court YSRCP Chandrababu Naidu Heritage AP Politics
Recent Comments
Leave a Comment

Related News