వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన ఇండియన్ రెవెన్యూ టాక్సెస్ సర్వీస్(ఐఆర్ టీఎస్) అధికారి వాసుదేవరెడ్డిని.. ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో లిక్కర్ తయారీ కంపెనీల(డిస్టిలరీస్)ను ఎంపిక చేయడం.. వారి నుంచి కమీషన్లు రాబట్టడం.. ఏయే కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలి.. ఎంతెంత సేకరించాలన్న విషయాలపై ఈ కేసులో ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డికి ఏ-2 గా ఉన్న వాసుదేవరెడ్డి వివరించారని.. తద్వారా 3500 కోట్ల రూపాయల మేరకు అక్రమంగా సంపాయించేందుకు రాచమార్గం ఏర్పాటు చేశారన్నది ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారుల వాదన.
ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ విషయం తెలియకముందే.. ఆయన హైద రాబాద్ లోని కార్యాలయం సహా.. తన ఇంట్లోని ఆధారాలను ధ్వంసం చేయడం మరో కీలక అంశం. దీంతో ఆ కేసుకూడా నమోదు చేశారు. ఈ క్రమంలో అరెస్టు తప్పదని భావించిన వాసుదేవరెడ్డి.. తనకు ముంద స్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో సిఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన పరార య్యారు. మొత్తంగా గత ఆరు మాసాలుగా గాలింపు చేపట్టిన అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేసి శనివారం ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు.
అప్రూవర్‌గా మారినా..
వాసుదేవరెడ్డి ఈ కేసులో నిజాలు ఒప్పుకొనేందుకు రెడీ అయ్యారంటూ..ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ.. వాసుదేవరెడ్డి సహా.. ఎక్సైజ్‌శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్ కీలకంగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది. వీరికి బెయిల్ ఇవ్వడం అంటే.. కేసు తలను నరికేసినట్టు అవుతుందని పేర్కొంది. వారికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముడు పులు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు కట్టబెట్టడంలో.. వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారన్న సీఐడీ అధికారుల వాదనలతో ఏకీభవించింది. అనంతరం.. రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు.