స్టార్ హీరోయిన్ సమంత జీవితం గత కొన్నేళ్లుగా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగుతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యల తర్వాత ఆమె మళ్ళీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడుమోరుతో తన రిలేషన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
నాగచైతన్యతో వివాహ బంధం ముగిసిన తర్వాత, తన మనసులో కలిగిన భయాందోళనలను సమంత ఓపెన్‍గా పంచుకున్నారు. ``ఒక బంధం విచ్ఛిన్నమయ్యాక, మళ్ళీ ఎవరినైనా నమ్మడం, ఎవరిపైనైనా ఆధారపడటం సాధ్యం కాదేమోననిపించింది. ఆ రకమైన ప్రేమను, స్నేహాన్ని స్వీకరించేంత మానసిక స్థితిలో నేను లేను`` అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని నింపింది రాజ్ నిడుమోరు అని ఆమె చెప్పుకొచ్చారు.
రాజ్‌తో తన రిలేషన్ గురించి చెబుతూ సమంత ఒక ఫన్నీ విషయాన్ని బయటపెట్టారు. ``నిజం చెప్పాలంటే మేమిద్దరం ఒక ఇరిటేటింగ్ కపుల్. ఎందుకంటే మేము ఏ పని చేసినా కలిసే చేస్తాం. కలిసి వర్కవుట్స్ చేస్తాం, కలిసి బయటకు వెళ్తాం, ఆఖరికి ఆడుకునేటప్పుడు కూడా కలిసే ఉంటాం. మా ఇద్దరికీ ఒకరి కంపెనీ అంటే అంత ఇష్టం`` అంటూ నవ్వుతూ తన క్రేజీ సీక్రెట్‌ను రివీల్ చేశారు. రాజ్ పరిచయం తర్వాతే తన దినచర్యలో, ఆలోచనా ధోరణిలో సానుకూల మార్పులు వచ్చాయని సామ్ పేర్కొన్నారు.
రాజ్ నిడుమోరు కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, నటిగా కూడా తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారని సమంత తెలిపారు. రాజ్ నా పక్కన ఉన్నంత కాలం నటిగా తాను మరిన్ని అద్భుతాలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కెరీర్ విషయానికి వస్తే.. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న తాజా చిత్రం `మా ఇంటి బంగారం`. సమంత తన సొంత నిర్మాణ సంస్థ `ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్`పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మే 15న మా ఇంటి బంగారం రిలీజ్ కానుంది. ఈ మూవీలో మొదటిసారి చీర కట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ చేశానని, ఇది తనకు ఒక కొత్త సవాల్ అని తాజా ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.