అమరావతి: విద్యాబుద్ధులు నేర్చుకుని గొప్ప స్థాయికి చేరుకోవాల్సిన ఒక యువ కిశోరం అర్థాంతరంగా తనువు చాలించింది. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. సదరు విద్యార్థిని మోహన్ బాబు యూనివర్సిటీ(Mohan Babu University)లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ నిత్యం క్లాసులకు హాజరయ్యేది. అయితే, మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఆమె ఉరివేసుకుని కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తోటి విద్యార్థులు మరియు హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే స్పందించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను రక్షించే ప్రయత్నంలో భాగంగా హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు.
ప్రాణాపాయం నుంచి బయటపడుతుందన్న ఆశతో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. భువన(Bhuvana)ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే యూనివర్సిటీ విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా ఉండే తమ తోటి విద్యార్థిని ఇలా నిర్జీవంగా పడి ఉండటం చూసి వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి భువన ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. చదువుల ఒత్తిడా? లేక వ్యక్తిగత సమస్యలా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భువన మృతికి గల కారణాలపై స్పష్టత లేకపోవడంతో తోటి విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.