వంట గదిలో నాని బీభత్సం

admin
Published by Admin — February 24, 2026 in Movies
News Image

ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, పాత్రలతో సాగిపోయే హీరో నేచురల్ స్టార్ నాని(natural star nani). అతను ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ చిత్రంలో జడల్ అనే షాకింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇది చాలా రా అండ్ రస్టిగ్గా ఉండబోతోందని ప్రోమోలు సంకేతాలు ఇస్తున్నాయి. 

దీని తర్వాత నాని మోడర్న్ అండ్ స్టైలిష్ అవతారంలోకి మారబోతున్నాడు. ఓజీ దర్శకుడు సుజీత్‌తో అతను ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కొన్నినెలల కిందటే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం.. ఇంకా చిత్రీకరణ దశలోకి వెళ్లలేదు. 

ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లే ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ (bloody Romeo)అనే టైటిలే ఖరారు చేశాడు సుజీత్. ఈ సినిమా కాన్సెప్ట్, నాని క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఈ టైటిల్ గ్లింప్స్‌ను తీర్చిదిద్దాడు సుజీత్(sujeeth). రియల్ క్యారెక్టర్లను చూపించకుండా యానిమేషన్ ద్వారా ఈ గ్లింప్స్‌ను రూపొందించాడు సుజీత్. కిచెన్‌లో ఒక చెఫ్ వంటకు సన్నాహాలు చేస్తుండగా.. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను మొదలుపెట్టారు. 

ఓవైపు చెఫ్ కూరగాయలు తరగడం దగ్గర్నుంచి ఒక్కో పని చేస్తుంటే.. ‘‘చిటికెడు కరుణ.. పిడికెడు కోపం.. బారెడు బీభత్సం.. సరిపోయేంత ఛాఛా మతిపోయేంత ప్రేమ’’ అంటూ వ్యాఖ్యానం సాగింది. ఐతే వంటకు కావాల్సినవన్నీ కుక్కర్లో వేసి మూత పెట్టాక.. విజిల్‌కు ఒక బాంబును జత చేస్తాడు చెఫ్. విజిల్ రాగానే అది కాస్తా పేలి వంట గది పేలిపోతుంది. తర్వాత ఫైరింజన్, పోలీసులు రంగప్రవేశం చేస్తారు. ఇంతలో ‘‘ఇలాంటి వంటా మిగలదు.. మనిషి కూడా బ్రతకడు’’ అని ఇంకో క్యారెక్టర్ డైలాగ్ పేలిస్తే.. ‘‘కానీ ఒక్కడు మిగిలాడు..’’ అంటూ వెన్నెల కిషోర్ హీరోకు ఎలివేషన్ ఇచ్చే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. 

హీరో నంబర్ వన్ చెఫ్‌లా కనిపించే నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్‌లా అంటూ కొసమెరుపు ఇచ్చారు. నాని మరో క్రేజీ క్యారెక్టర్ చేయబోతున్నాడని ఈ గ్లింప్స్ సంకేతాలు ఇచ్చింది. విజువల్స్‌తో పాటు ప్రవీణ్ వెయ్రా కంపోజ్ చేసిన ‘నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్’ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. వేసవిలో చిత్రీకరణ మొదలుపెట్టుకోనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇంతకుముందు నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ తీసిన వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Tags
Sujeeth hero nani bloody romeo
Recent Comments
Leave a Comment

Related News