మారిన `కేర‌ళ` పేరు.. ఇక‌పై ఎలా పిల‌వాలంటే..?

admin
Published by Admin — February 24, 2026 in National
News Image

దక్షిణ భారతాన ప్రకృతి ఒడిలో ఒదిగిపోయే కేరళ(Kerala) రాష్ట్రం ఇప్పుడు తన అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. దశాబ్దాలుగా మనం పిలుస్తున్న `కేరళ` అనే పేరు త్వరలో చరిత్ర పుటల్లోకి చేరనుంది. మలయాళీలు తమ రాష్ట్రాన్ని ఎలాగైతే ప్రేమగా పిలుచుకుంటారో, అదే పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అధికారిక ముద్ర వేసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కేర‌ళ‌ పేరు మార్పు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.

మలయాళ భాషలో ఈ రాష్ట్రాన్ని `కేరళం` అని పిలుస్తారు. అయితే బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న ఇంగ్లీష్ ఉచ్చారణ ప్రభావంతో అది కేరళగా స్థిరపడిపోయింది. తమ భాషా సంస్కృతులకు అద్దం పట్టేలా కేరళం(Keralam) అనే పేరునే అధికారికంగా వాడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర క్యాబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇకపై ప్రభుత్వ రికార్డులు, గెజిట్లలో మనకు కేరళం అనే కనిపిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అయితే, పేరు మార్చడం అనేది కేవలం ఒక ప్రకటనతో ముగిసేది కాదు. దీని కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొన్ని పద్ధతులు పాటించాలి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత, పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. గతంలో ఒరిస్సాను `ఒడిశా`గా, పాండిచ్చేరిని `పుదుచ్చేరి`గా మార్చిన తరహాలోనే ఇప్పుడు కేరళ కూడా తన అసలు పేరును దక్కించుకోబోతోంది.

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మలయాళీ ప్రజల సెంటిమెంటును గౌరవించడం ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నాయి. కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, ఇది ఆ ప్రాంత భాషా గౌరవానికి దక్కిన గుర్తింపుగా స్థానికులు భావిస్తున్నారు.

Tags
Keralam Kerala Name Change Kerala Union Cabinet Pinarayi Vijayan Narendra Modi
Recent Comments
Leave a Comment

Related News

Latest News