మేగజైన్ స్టోరీ: భోగాపురంపై జగన్నాటకం!

admin
Published by Admin — February 25, 2026 in Andhra
News Image

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రతిపాదించి, భూములు సేకరించి, నిర్మాణానికి శంకుస్థాపన చేసింది 2014-19 నడుమ సీఎంగా ఉన్న చంద్రబాబే. నాడు ప్రతిపక్షంలో ఉండగా దానిపై జగన్మోహన్‌రెడ్డి అవాకులు చెవాకులు పేలారు. విశాఖపట్నం విమానాశ్రయం ఉండగా.. మళ్లీ కొత్తగా దానికి దగ్గర్లో కొత్త ఎయిర్‌పోర్టు అవసరమేంటని నిలదీశారు.

ఎర్రబస్సు కూడా రాని ఊరుకు విమానాశ్రయం ఏమిటని హేళన చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక దానిని గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబే పూర్తిచేస్తుండడంతో.. ఆ ఐదేళ్లలో తానేదో ఊడబొడిచినట్లుగా.. క్రెడిట్‌ కొట్టేసేందుకు జగన్‌ నానా తంటాలు పడుతున్నారు. లేని గొప్పలు చెప్పుకొంటూ తన సొంత పత్రికలో కథనాలు వండి వారుస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇదెవరూ నమ్మకపోవడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు.

అది నేవీ ఎయిర్‌పోర్టు..

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆంక్షలతో నడుస్తోంది. ఒకవైపు నేవీ అవసరాలకు వాడుకుంటూ.. మరోవైపు పౌర విమానాలను అనుమతిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు నడపాలన్నా.. అదనపు స్లాట్లు కేటాయించాలన్నా నౌకాదళం చాలా పరిమితంగా అనుమతులిస్తోంది.

దీనివల్ల విమానయాన సంస్థలు విశాఖ రావడానికి తటపటాయించే పరిస్థితి. ఇలాగైతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేశంలో ఎక్కడా లేని విధంగా సముద్రం పక్కనే భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన మంత్రిగా టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు ఉండడంతో వెంటనే ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది.

చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించే నాయకుడు కావడంతో విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లు (ఎంఆర్‌ఓ) కూడా అక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీని కోసం భూ సేకరణకు నడుం కట్టారు. దీనిని జగన్‌ తప్పుబట్టారు. ‘భోగాపురానికి ఎర్ర బస్సు కూడా వెళ్లదు. అలాంటి గ్రామంలో చంద్రబాబు అంతర్జాతీయ విమానాశ్రయం కడతానంటున్నాడు. విశాఖలో విమానాశ్రయం ఉంటే.. దానికి కేవలం 25 కి.మీ. దూరాన మరొకటి నిర్మిస్తామనడం సరైనది కాదు. (ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే రెంటి మధ్యా 54 కిమీకుపైగా దూరం ఉంది)’ అని చెప్పారు. అంతటితో ఆగకుండా భోగాపురం మండలానికి వెళ్లి.. రైతులెవరూ విమానాశ్రయానికి భూములు ఇవ్వొద్దన్నారు.

బలవంతంగా లాక్కుంటే కోర్టులకు వెళ్లాలని సలహా ఇచ్చి.. కొందరితో కోర్టులో కేసులు కూడా వేయించారు. తీసుకున్న భూములను తాను అధికారంలోకి వచ్చాక తిరిగి ఇచ్చేస్తానన్నారు. ఇలా భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి అడుగడుగునా అడ్డం పడ్డారు. అయితే వీటన్నింటిని అధిగమించి చంద్రబాబు 2,703 ఎకరాల భూమిని సేకరించి, 2019 ఫిబ్రవరిలో భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలు జీఎంఆర్‌ గ్రూపునకు అప్పగించి శంకుస్థాపన కూడా చేశారు.

500 ఎకరాలు వెనక్కి తీసుకున్న వైసీపీ..

జగన్మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే భోగాపురం విమానాశ్రయం పనులు జరగకుండా అడ్డం పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ మురిగిపోయే వరకు ఒక్క పని కూడా చేపట్టలేదు. దాంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా జీఎంఆర్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వడానికి నిరాకరించింది. వీటన్నింటినీ చూపించి జీఎంఆర్‌తో జగన్‌ రాయబేరాలు నడిపారు. కాకినాడ సెజ్‌ భూములతో లింకులు పెట్టి దారికి తెచ్చుకున్నారు. భోగాపురంలో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లు (ఎంఆర్‌ఓ) అవసరం లేదంటూ ఒక నివేదిక తయారు చేయించి.. చంద్రబాబు కేటాయించిన భూమిలో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు.

విమానాశ్రయానికి 2,203 ఎకరాలే ఇచ్చారు. ఆ భూముల్లో కొబ్బరి, జీడి, తాటి చెట్లు అన్నీ కొట్టించి చదును చేసి.. జీఎంఆర్‌కు అప్పగించాల్సి ఉండగా మూడేళ్లు నానా తిప్పలు పెట్టారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో హడావుడిగా చంద్రబాబు పునాది రాయి చేసిన విమానాశ్రయానికే జగన్మోహన్‌రెడ్డి 2023 డిసెంబరులో మళ్లీ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకొన్నారు. ఆయన అనుయాయులు, బంధుమిత్రులు విశాఖ-భోగాపురం రోడ్డువెంబడి వందల ఎకరాలు కొనేశారు. ఇవ్వకపోతే బలవంతంగా కొట్టేశారు కూడా.

కూటమి వచ్చాక పరుగులు తీసిన పనులు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడికి మోదీ కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ దక్కడంతో విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన నిరంతరం సమీక్షిస్తూ పనులు త్వరితంగా పూర్తి చేయడానికి కృషిచేస్తున్నారు. వాస్తవానికి 2026 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సి ఉండగా.. చంద్రబాబు జీఎంఆర్‌పై ఒత్తిడితెచ్చి జూన్‌ నాటికి చేయాలని ఆదేశించారు. ఆ సంస్థ దాని కంటే ముందే పనులు పూర్తిచేసేస్తోంది. ఇటీవల అక్కడ ఎయిర్‌ ఇండియా విమానం విజయవంతంగా ల్యాండయింది.

ట్రయన్‌ రన్‌ పూర్తయింది. ఈ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహించడానికి జీఎంఆర్‌తో 40 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత మరో 20 ఏళ్లు కాంట్రాక్టు పొడిగిస్తారు. విమానాశ్రయానికి కేటాయించిన భూమిలో 1.3 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వి రన్‌వే, భవనాల నిర్మాణానికి అనుగుణంగా భూమిని చదును చేశారు. ఇది ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన పని. నిర్మాణానికి రోజూ 24 గంటలూ ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో మూడు వేల మంది అక్కడే బస ఉంటున్నారు. ఇప్పటివరకూ 35 మిలియన్ల పని గంటలు పూర్తిచేశారు. విశాఖలో హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు గంటకు 240 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

దాంతో పెనుప్రమాదాలు జరిగాయి. అంతకంటే పెద్ద తుఫాన్‌ వచ్చి గంటకు 275 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనం నిర్మించారు. అందుకు తగిన అద్దాలను బిగించారు. గంటకు 295 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్‌ నిర్మాణం చేపట్టారు. సొంతంగా విద్యుత్‌ తయారు చేసుకునేందుకు ఐదు మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టారు. జనాలను బట్టి ఆటోమేటిగ్గా సర్దుబాటు చేసుకునేలా ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రన్‌వే పొడవు 3.8 కి.మీ. పక్కనే ట్యాక్సీ ట్రాక్‌ మరో 3 కి.మీ. పొడవున నిర్మించారు.

ఇప్పుడు గంటకు 10-12 విమానాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఏడు ఏరో బ్రిడ్జిలు, 18 టాక్సీ స్టాండులు కూడా నిర్మించారు. ఈ ఏడాది జూన్‌ 26న ప్రారంభోత్సవానికి జీఎంఆర్‌ సంసిద్ధమైంది. జూలై నుంచి విమానాల రాకపోకలకూ సర్వసన్నాహాలు చేస్తోంది. దీంతో జగన్‌ అసూయతో రగిలిపోయారు. చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జీఎంఆర్‌కు ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలను జగన్‌ లాక్కుంటే.. ఎయిర్‌పోర్టుకు అనుబంధంగా ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సిటీ ఏర్పాటుచేయాలని చంద్రబాబు నిర్ణయిస్తే... అశోక్‌గజపతిరాజు తనకు వారసత్వంగా వచ్చిన 136 ఎకరాలను మాన్సాస్‌ ట్రస్ట్‌ తరఫున ఉచితంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.

ఆయన కుమార్తె అదితి గజపతిరాజు దీనికి పూనుకోవడం ప్రశంసదాయకం. ఆ భూముల విలువ సుమారు వెయ్యి కోట్లు ఉంటుంది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని తెలిసినా నిస్సిగ్గుగా భోగాపురం విమానాశ్రయం ఘనత తదనదేనంటూ జగన్‌ డబ్బా కొట్టుకుంటున్నారు.

Tags
Jagan's credit dramas bhogapuram airport Cm chandrababu Tdp Ycp
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News

Latest News