లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్‌.. క‌విత ఫ‌స్ట్ రియాక్ష‌న్ ఇదే!

admin
Published by Admin — February 27, 2026 in Politics, Telangana
News Image

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసిన కోర్టు.. ఆమెపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న కవిత, తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ అత్యంత భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు.

తీర్పుపై స్పందిస్తూ కవిత ``సత్యమేవ జయతే`` అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.``మేము మొదటి నుండి చెబుతున్నదే నిజమైంది. ఈ కేసు కేవలం ఒక రాజకీయ కుట్ర అని, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే అల్లిన కథ అని కోర్టు తీర్పుతో తేలిపోయింది. న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నాపై ఎన్ని బురదజల్లినా, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పాను.. ఈరోజు అదే జరిగింది,`` అని ఆమె ధీమాగా పేర్కొన్నారు. తనను రాజకీయంగా, మానసికగా హింసించిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

జైలు జీవితం గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ కవిత కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా తాను లేని సమయంలో తన పిల్లలకు అండగా నిలిచిన అత్తామామయ్యలకు, తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ``నేను జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం పడ్డ ఆవేదన నాకు తెలుసు. కానీ, తెలంగాణ సమాజం, జాగృతి కార్యకర్తలు చూపిన ప్రేమ నన్ను నిలబెట్టింది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఢిల్లీ కోర్టుల చుట్టూ నా కోసం తిరిగిన కార్యకర్తలను నేను జీవితాంతం కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను,`` అని కవిత హామీ ఇచ్చారు.

కాగా, ఈ కేసులో కవితతో పాటు మరో 23 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వార్త తెలియగానే తెలంగాణవ్యాప్తంగా జాగృతి శ్రేణులు,  పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి, ఐదు నెలల జైలు వాసం, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కవిత సంపూర్ణ విముక్తి పొందడం ఆమె రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది.

Tags
Kalvakuntla Kavitha Delhi Liquor Case Rouse Avenue Court Telangana Jagruthi Excise Policy Case K Kavitha
Recent Comments
Leave a Comment

Related News