కూటమి ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగునూ.. వైసీపీ(ycp) అధినేత, మాజీ సీఎం జగన్ గమనిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. జగన్(jagan) ప్రజల మధ్యకు రావడం లేదన్న మాటే కానీ.. పార్టీ కార్యకర్తలతో భేటీలు కూడా నిర్వహించడం లేదని అంటున్నా.. ఆయన మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగునూ పరిశీలిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న సాంకేతిక వ్యవస్థ ద్వారా.. ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు.
తాజాగా మార్చి నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్లు(pensions)(ఎన్టీఆర్ భరోసా పింఛన్లు) రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే పంపిణీ ప్రారంభించారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో 2వ తేదీ వరకు పేదలను వెయిట్ చేయించరాదన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుగానే పంపిణీ చేస్తోంది. గత 20 మాసాలుగా 1వ తేదీన సెలవు వచ్చినా.. ఏదైనా పండగ ఉన్నా.. ముందు రోజే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూడా తెల్లతెల్లవారుతూనే లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్ చేరిపోయింది.
అయితే..గతంలో వైసీపీ హయాంలో వాలంటీర్లు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఇచ్చేవారు. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకమని చెప్పుకొనేవారు. వాలంటీర్లు లేకపోతే.. పింఛన్లు కూడా పంపిణీ చేయలేరని కూడా వ్యాఖ్యానించారు. కానీ, ప్రస్తుతం గ్రామ, వార్డు సెక్రటరీల కార్యదర్శులతోనే కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేస్తోంది. దీనిలో ఎక్కడా లోపాలు రాకుండా.. ఉదయం 5 గంటల నుంచే ఉన్నతాధికారులు ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వీస్) నుంచి పర్యవేక్షిస్తున్నారు.
అయినప్పటికీ.. ఎక్కడైనా లోపాలు ఉంటే.. వాటిని ప్రచారం చేయాలన్నది సహజంగా వైసీపీ ఉద్దేశం. ఈ అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ అధినేత జగన్ పింఛన్లపై ఆరా(enquiry) తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంచేశారా? ఇంకా ఎక్కడైనా పంపిణీ ఆగిపోయిందా? ఆ వివరాలు చెప్పాలంటూ.. ఆయన పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని సమాచారం కోరారు. కానీ, మధ్యాహ్నం 1 గంటకే 70 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ జరిగిపోయినట్టు ప్రభుత్వమే పేర్కొనడం గమనార్హం. ఏదేమైనా కూటమి సర్కారు ప్రతి చర్యనూ జగన్ పరిశీలిస్తున్నారనడానికి ఇదో ప్రధాన ఉదాహరణ.