వైసీపీని వీడి, పవన్‌కల్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడనయ్యానని చెబుతూ జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఇమడలేకపోతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఒంగోలు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు బాలినేనిని ఆత్మరక్షణలో పడేశాయి. జనసేనలో ఆయన ప్రస్థానం క్లైమాక్స్‌కు చేరుకుందా అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య దశాబ్దాలుగా ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు కూటమిలో చిచ్చు పెడుతోంది. జనసేనలో చేరిన తర్వాత అంతా సర్దుకుంటుందని బాలినేని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సొంత పార్టీ నేతలు సైతం తనను పట్టించుకోవడం లేదని, కనీస ప్రాధాన్యత దక్కడం లేదని బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. `
ఈ పరిణామాల నడుమ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బాలినేని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు పార్టీ అండ లేకపోయినా పర్వాలేదు, ప్రజల మద్దతు ఉందంటూ ఆయన అనడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం అని చెప్పడం ద్వారా, తాను జనసేన నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను ఆయన పంపినట్లయ్యింది. వారంలో రెండు మూడు రోజులు ఒంగోలులోనే ఉంటాను.. నీ కథేంటో చూస్తానంటూ ఎమ్మెల్యే దామచర్లను ఉద్దేశించి బాలినేని చేసిన ఘాటు వ్యాఖ్యలు, కూటమిలో ముదురుతున్న విభేదాలకు అద్దం పడుతున్నాయి.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి?
బాలినేని పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాకుండా తయారైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జనసేనను వీడితే ఆయన తదుపరి అడుగు ఎటు? వైసీపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలు, గతంలో జగన్ ఇచ్చిన గౌరవాన్ని కాదనుకుని వెళ్లడం వంటి అంశాలు ఆయన పునరాగమనానికి అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో బాలినేని స్వతంత్రంగా వెళ్తారా లేక వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది మిస్టరీగా మారింది. మొత్తానికి జనసేనలో బాలినేని ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.