తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 14 రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు కావడంతో మరిన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై సభ ప్రారంభం రోజు అంటే.. 16న బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సభలో ప్రసంగిస్తారు.
ఇక, 20న అసెంబ్లీలో మంత్రి భట్టివిక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.అయితే.. ఇ ప్పుడు ఈ విషయమే ప్రభుత్వాన్ని అంతర్మథనంలో పడేసింది. ముందుగా నిర్ణయించిన డేట్ ప్రకారం.. 20 అని ప్రకటించేశారు. కానీ, అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ చేసుకుంటారని.. హైదరాబాద్‌లో అయితే.. మరింత ఎక్కువగా ఈ పండుగను నిర్వహించుకుంటారని మత పెద్దలు చెబుతున్నారు. దీనిపై పలువురు మంత్రులు తాజాగా ప్రభుత్వానికి విన్నవించారు.
ముస్లిం సామాజిక వర్గం నుంచి వస్తున్న అభ్యర్థలను వారు సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)కి తేల్చి చెప్పారు. రంజాన్ రోజు సభలకు సెలవు ఉంటుందని.. అయితే.. ఆరోజు సభను నిర్వహించడం.. ఏకంగా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం సరికాదని అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే.. దీనికి ముందు రోజు నిర్వహించాలని అనుకున్నా 19వ తేదీ కూడా సెలవు వచ్చింది. ఆ రోజు.. తెలుగు సంవత్సరాది. దీంతో ఆరోజు కూడా సెలవు వచ్చింది.
ముహూర్తం కోసమే..
ఈ నేపథ్యంలో 21 లేదా 22న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు వీలు చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎస్ రామకృష్ణారావు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. భట్టి ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. తన పేరుతో ఉండే బలమైన తిథి, నక్షత్రం కోసం చూస్తున్నారన్న వాదన ఉంది. దీంతోనే ఆయన 20వ తేదీని ఫిక్స్ చేశారని అంటున్నారు. కానీ.. తాజా అభ్యర్థనల నేపథ్యంలో ఈ తేదీని మార్చక తప్పదన్న చర్చ సాగుతోంది.