ట్రోలర్స్ కు రేణు దేశాయ్ షాక్

admin
Published by Admin — March 03, 2026 in Movies
News Image
సోష‌ల్ మీడియా(social media)లో త‌న‌పై వ‌స్తున్న కామెంట్లు, పోస్టుల విష‌యంపై మాజీ న‌టి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా అనేది ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగంగా ఉండాల‌ని.. కానీ, వ్య‌క్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దుర్భాష‌లు చేసేందుకు కాద‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌పై కొంద‌రు సామాజిక మాధ్య‌మాల్లో చేస్తున్న వ్యాఖ్య‌లు త‌న‌ను తీవ్రంగా క‌ల‌చి వేస్తున్నాయ‌ని తెలిపారు. ఇలాంటి దుర్భాష‌లాడేవారు.. తాము చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను త‌మ అమ్మానాన్న‌లు, అక్కాచెల్లెళ్ల‌కు చూపించాల‌ని.. అప్పుడు వారేం చెబుతారో వినాల‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ (trolling)చేస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీకి రేణు దేశాయ్ ఫిర్యాదు చేశారు. ప్రధానంగా నాలుగు అకౌంట్లపై ఆధారాలతో సహా కంప్లయింట్(complaint) చేశారు.
 
తాను ఒక సంద‌ర్భంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు `క‌ట్ చేసి`.. సోష‌ల్ మీడియాలో వేరే సంద‌ర్భంలో దారుణంగా వినియోగించారని తెలిపారు. అయితే.. వారెవ‌రో త‌ను తెలుసుకుంటాన‌ని.. వారిని ఇంటికి వెళ్లి మ‌రీ నిల‌దీస్తాన‌ని చెప్పారు. వారి త‌ల్లిదండ్రుల ముందే వారి విష‌యాన్నితేలుస్తాన‌ని రేణుదేశాయ్ హెచ్చ‌రించారు. ``అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించేవారు.. త‌మ ముఖాలు క‌నిపించ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇష్టానుసారంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు`` అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.
 
ఏం జ‌రిగిందంటే..
 
గ‌త నెల‌లో తెలంగాణ‌లోని ఓ గ్రామంలో ప‌దుల సంఖ్య‌లో వీధికుక్క‌ల‌ను రాత్రికి రాత్రి మందు పెట్టి చంపేశారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రం లో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో.. వీధికుక్క‌ల‌ను లేకుండా చేస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు రెండు గ్రామాల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అప్ప‌ట్లో పోలీసులు తెలిపారు. ఈ కేసు విష‌యంపై.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన రేణు దేశాయ్‌.. జంతు ప్రేమికుల‌తో క‌లిసి.. హైద‌రాబాద్‌లోని ప్రెస్ క్ల‌బ్‌లో మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఆమె..వీధికుక్క‌ల‌ను చంప‌డంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.
 
100 కుక్క‌ల్లో 10 కుక్క‌లే చెడ్డ‌వ‌ని అందుక‌ని అన్నింటినీ చంపేస్తారా? అంటూ రేణు దేశాయ్(Renu desai) అప్ప‌ట్లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ ప‌ది కుక్క‌ల‌తోనే జాగ్ర‌త్తగా ఉండాల‌ని, మిగిలిన వాటిని చంపేయ‌డం ఎందుక‌ని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను సోష‌ల్ మీడియాలో వ‌క్రీక‌రించార‌ని రేణుదేశాయ్ తెలిపారు. వేరే ఘటనలో చిన్నపిల్ల చనిపోతే రేణు దేశాయ్ కుక్క‌ల‌పై చేసిన వ్యాఖ్య ల‌ను ఎడిట్ చేసి ఆ ఘటనకు అటాచ్‌ చేశారని చెప్పారు. అదేస‌మ‌యంలో యూట్యూబ్‌ ఛానళ్లు, సోషల్‌మీడియా వేదికగా త‌నను అసభ్య పదజాలంతో దూషించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వారిని వెతుక్కుంటూ వెళ్లి.. వారిత‌ల్లిదండ్రుల ముందే నిల‌బెడ‌తాన‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను అక్కాచెల్లెళ్ల‌కు చూపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల‌న్నారు.
 
ఈ ఒక్క‌సారే కాదు!
 
రేణు దేశాయ్‌.. ఈ ఒక్క ఘ‌ట‌న గురించే కాదు..గ‌తంలో త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి కూడా సోష‌ల్ మీడియా దుష్ప్ర‌చారం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``నేను విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి నా గురించి రకరకాలుగా కామెంట్లు చేశారు. నా వ్యక్తిగత జీవితం, నేను తీసుకున్న భరణం, నేను మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీ.. ఇలా దేన్నీ వదలలేదు.`` అని పేర్కొన్నారు. ఏ సంస్కారంతో మీ త‌ల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు? అంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసిన వారిని రేణు దేశాయ్ నిల‌దీశారు. మీ దుర్మార్గపు వ్యాఖ్య‌ల‌ను ఎండగడతాన‌ని ఆమె హెచ్చ‌రించారు.
Tags
renu desai police complaint trolling social media
Recent Comments
Leave a Comment

Related News